Inhuman Incident in kamareddy : కాసుల కోసం కన్నపేగు అన్న కనికరం కూడా చూపలేదు ఆ పిల్లలు. కొందరు కొడుకులు తల్లిదండ్రులను తిప్పలు పెడతారు.. కానీ కూతుళ్లు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకునేవాళ్లం. కానీ నేటి సమాజంలో కొంతమంది కుమార్తెలు కూడా కన్నబంధాని కంటే కాసులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కానీ ఆమె కుమార్తెలు మాత్రం.. తమకు ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకులో డిపాజిట్ ఉన్న డబ్బులు ఇవ్వలేదని తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి దహనసంస్కారాలు చేయడానికి నిరాకరించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌బీనగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి కిష్టవ్వకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మరోవైపు చికిత్స పొందుతున్న సమయంలో ఆస్తి కోసం కుమార్తెలు ఆమెపై దాడి చేశారు. కిష్టవ్వ పేరిట ఇల్లు, బ్యాంకులో ఖాతాలో రూ.1,70,000 ఉన్నాయి. అవి తమకు ఇవ్వాలని కుమార్తెలు పట్టుబట్టారు. అందుకు కిష్టవ్వ నిరాకరించింది. మృతురాలి పేరిట ఉన్న ఆస్తులకు నామినీగా ఓ బంధువు ఉన్నారు. తల్లి తన ఆస్తిని తమకు ఇవ్వకుండా వేరే వాళ్ల పేరిట రాయడంతో కుమార్తెలు ఆమెపై ఆగ్రహించారు.
సొమ్ము ఇస్తేనే శవాన్ని తీసుకెళ్తాం: ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కిష్టవ్వ మరణించింది. వైద్యులు కిష్టవ్వ మరణం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మృతురాలి బ్యాంకు ఖాతాలో సొమ్ము ఇస్తేనే శవాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పడంతో.. వైద్యులు కిష్టవ్వ మృతదేహాన్ని శవాగారంలోనే ఉంచారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం పలువురు హృదయాల్ని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: Mission Bhagiratha : మీ ఇంటికి 'మిషన్ భగీరథ' నీళ్లు రావట్లేదా.. అయితే సర్పంచులకు చెప్పండి.!
Priyanka Gandhi Hyderabad Tour : ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు.. ఆ టైమ్‌కే సభ స్టార్ట్
పెళ్లి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. 17 మందికి గాయాలు.. పైకప్పు పూర్తిగా ధ్వంసం
మణిపుర్లో కర్ఫ్యూ సడలింపు.. డ్రోన్ల ద్వారా నిఘా.. మెడిసిన్ల కోసం రోడ్లపైకి ప్రజలు!