Rajasthan honour killing: ఇష్టం లేని వ్యక్తిని పెళ్లిచేసుకుందని కన్న కూతురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. గర్భంతో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా.. కూతురిపై ఆటో ఎక్కించేందుకు యత్నించాడు. రాజస్థాన్ భరత్‌పుర్‌లోని సహ్యోగ్ నగర్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే...
భరత్‌పుర్‌లో నివసించే ఇస్లామ్ ఖాన్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి కూతురు నగ్మా ఖాన్.. నరేందర్ కుమార్ సైనీ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇరువురూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. దిల్లీకి వెళ్లి.. అక్కడి ఆర్యసమాజ్‌లో దండలు మార్చుకొని.. తమ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా భరత్పుర్లోనే నివసిస్తున్నారు. అయితే, బలవంతంగా తన కూతుర్ని కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని నగ్మా తండ్రి.. యువకుడిపై కేసు పెట్టాడు.
పోలీసు కేసులతో పాటు, యువతి కుటుంబ సభ్యులకు భయపడిన నరేందర్.. తన భార్యను తీసుకొని మధ్యప్రదేశ్‌లోని కట్నీకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే నగ్మా గర్భం దాల్చింది. అనంతరం దంపతులు పట్టణానికి వచ్చారు. గురువారం మధ్యాహ్నం నగ్మాను నరేందర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఇస్లాం ఖాన్ ఆటోతో వచ్చి ఢీకొట్టాడు. దంపతుల శరీరం పైనుంచి ఆటోను తీసుకెళ్లేందుకు యత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు నగ్మా ఆటోను తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.
చుట్టపక్కలవారంతా అక్కడికి చేరుకునేసరికి ఇస్లాం ఖాన్ ఆటోతో సహా పారిపోయాడు. ఆటోలో మరికొంతమంది కూర్చొని ఉన్నారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాధిత దంపతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి నుంచి ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరమైన ఆయుధాలను సైతం ఆటోలో తీసుకొచ్చాడని ఇస్లాం ఖాన్‌పై దంపతులు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: