Dalit Student Death : ఉత్తర్‌ప్రదేశ్ ఔరయలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఒక పదం తప్పు రాశాడని దళిత విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ ఇంటర్ కాలేజీలో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్ కుమార్ (15).. పదో తరగతి చదువుతున్నాడు. అయితే సెప్టెంబరు 7న కళాశాలలో సైన్స్ టీచర్ అశ్వనీ సింగ్.. ఓ పరీక్ష నిర్వహించాడు. ఆ ఎగ్జామ్‌లో ఒక పదం తప్పు రాసినందుకు ఉపాధ్యాయుడు అశ్వనీ సింగ్.. నిఖిత్ను జుట్టు పట్టుకుని కర్రతో దారుణంగా కొట్టాడు. దీంతో నిఖిత్ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబసభ్యులు కాలేజీకి చేరుకుని అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం లఖ్‌నవూ తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.
ఆ సమయంలో టీచర్ అశ్వనీ సింగ్‌పై కోపంతో బాధితుడి కుటుంబ సభ్యులు.. కళాశాలకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కళాశాల ప్రిన్సిపల్ వారిని సముదాయించి నిఖిత్ వైద్యానికి అయ్యే ఖర్చును టీచర్ భరిస్తాడని చెప్పడం వల్ల వారు శాంతించారు. బాధితుడి వైద్యానికి దాదాపు రూ.40 వేలు.. ఖర్చు పెట్టాడు అశ్వనీసింగ్. అయినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం నిఖిత్ మరణించాడు. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: రాజస్థాన్ సంక్షోభం.. అధిష్ఠానం అలర్ట్.. పోటీ నుంచి గహ్లోత్‌ను తప్పించాలని డిమాండ్!
'నాకున్న బలమేంటో అప్పుడు చూస్తారు!'.. అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ కామెంట్స్