బౌద్ధ మత గురువు దలైలామా.. ఓ బాలుడితో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. బాలుడిని పెదాలపై ముద్దు పెట్టడం, తన నాలుకను నోటితో తాకాలని కోరిన దలైలామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై దలైలామా స్పందించారు. ఆ బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
''మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది' అని ఓ బాలుడు దలైలామాను కోరారు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన.. 2 నిమిషాల 5 సెకన్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు, తీరు ఎవరినైనా బాధించి ఉంటే.. అందుకు ఆ బాలుడు, అతడి కుటుంబానికి దలైలామా క్షమాపణలు తెలియజేస్తున్నారు. దలైలామా.. తనను కలిసే వ్యక్తులు.. ముఖ్యంగా చిన్నారులతో సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు కూడా. బహిరంగ సభల్లో, కెమెరాల ముందైనా ఆయన అలాగే ఉంటారు. జరిగిన దానికి (వైరల్ వీడియోను ఉద్దేశిస్తూ) దలైలామా విచారం వ్యక్తం చేస్తున్నారు'' అని దలైలామా బృందం ఆ ప్రకటనలో తెలిపింది.
తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొన్న దలైలామా.. అతడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. దలైలామా తన నాలుకను బయటపెట్టి.. 'నీ నోటితో నా నాలుకను తాకుతావా' అని బాలుడిని అడగడం వినిపించింది. దీంతో ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
చైనాపై మండిపడ్డ దలైలామా..
మరోవైపు.. బౌద్ధ మతాన్ని ధ్వంసం చేయాలన్న చైనా ప్రయత్నాలు ఫలించవని దలైలామా అన్నారు. బౌద్ధాన్ని నమ్మే వారు ఉన్నంతకాలం.. చైనా కమ్యూనిస్టులు ప్రయత్నాలు ఫలించవని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బుద్ధగయలో పర్యటించిన ఆయన.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హిమాలయాల్లో ఉండే స్థానిక ప్రజలు బుద్ధుడిని ఆరాధిస్తారని తాను గర్తించినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి మంగోలియా, చైనాల్లో కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా చైనాపై మరికొన్ని ఘాటు విమర్శలు చేశారు. టిబెట్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇంతకీ దలైలామా ఏం అన్నారో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.