అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తుపానుగా మారింది. 'తౌక్టే'గా వ్యవహరిస్తున్న ఈ తుపాను అమిని దీవికి 160 కిమీ ఈశాన్య దిశగా కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది మరింత బలపడి మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తౌక్టే తుపాను మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది.
ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 మధ్య తుపాను గుజరాత్ వద్ద తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. తీరం దాటేప్పుడు 150-175 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రాష్ట్రాలు అప్రమత్తం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్రాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. తూర్పు తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రభావిత జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశాయి.
తుపాను కారణంగా కేరళలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మొదలైన ఈ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి.
మహారాష్ట్ర
తౌక్టే తుపానుపై భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని తీర ప్రాంత జిల్లాల అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగేలా చూడాలని చెప్పారు.
పాల్ఘఢ్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఠాక్రే సూచించారు.
గోవా
గోవా సర్కారు సైతం సహాయక చర్యల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తుపానును ఎదుర్కొనేందుకు అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. కొంకణ్ సహా గోవాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
మోదీ సమీక్ష
తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాల సన్నద్ధతపై ఆరా తీయనున్నట్లు వెల్లడించారు. జాతీయ విప్తతు నిర్వహణ అథారిటీ అధికారులతో మోదీ భేటీ అవుతారని చెప్పారు. సహాయక చర్యలపై రాష్ట్రాలు చేసుకుంటున్న ఏర్పాట్లపై మోదీ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
తుపాను పరిస్థితుల నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభావిత రాష్ట్రాలకు అదనపు బృందాలను పంపుతోంది కేంద్రం. భువనేశ్వర్ నుంచి ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీటిని ఆ రాష్ట్రానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ద్వారకా, పోర్బందర్ వంటి తీర ప్రాంతాల్లో వీరిని మోహరించనున్నట్లు చెప్పారు.
ప్రమాదకరంగా నదుల ప్రవాహం
తౌక్టే ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత పశ్చిమ తీర, సెంట్రల్ వాటర్ కమిషన్ కేరళ, తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందని తెలిపింది. ఇప్పటికే కేరళలోని మణిమాల, అచాన్కోవిల్ నదులు తమిళనాడులోని కొడైయార్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
ఇదీ చదవండి: కర్ణాటక నుంచి బైడెన్, కమలకు మాస్కులు