జాతీయ జెండా ముద్రించి ఉన్న కేకును కోసి తినడాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు సోమవారం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎన్ ఆనంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసులో తీర్పునిచ్చింది.
ఏం జరిగింది?
2013, డిసెంబర్ 25న కోయంబత్తూర్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 6 అడుగుల పొడవుతో, 5 అడుగుల వెడల్పుతో ఓ కేకును తయారు చేశారు. దానిపై అశోక చక్రంతో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ముద్రించారు. ఆ కేకును కార్యక్రమానికి హాజరైన వారందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకల్లో 1,000 మంది పిల్లలు సహా 2,500 మంది పాల్గొన్నారు. డీసీపీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో జాతీయ పతాకాన్ని అవమానపరిచారని పేర్కొంటూ హిందూ పబ్లిక్ పార్టీకి చెందిన డి.సెంథిల్ కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరించలేదు. 2017 ఫిబ్రవరిలో స్థానిక మేజిస్ట్రేట్ వద్ద దీనిపై ఫిర్యాదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఓ స్థానిక పోలీస్ అధికారి హైకోర్టును ఆశ్రయించారు.
నేరంగా పరిగణించలేం..
దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ చర్యను ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్, 1971 చట్టం సెక్షన్ 2 కింద నేరంగా పరిగణించలేమని పేర్కొంది. ఆ వేడుకల్లో పాల్గొన్నవారు జాతీయ జెండాను కూడా దరించారన్న ధర్మాసనం.. ఆ జెండాను తమతో పాటు ఎప్పుడూ ఉండనీయలేదు కదా అని వ్యాఖ్యానించింది. దానిని కూడా ఓ చెత్త కాగితంలా తీసి పారేశారు కదా అని ప్రశ్నించింది. మరి అలాంటప్పుడు ఆ వేడుకల్లో పాల్గొన్నవారందరిపై చర్యలు తీసుకోవాలా? అని ప్రశ్నించింది.
అవమానం అనే పదానికి నిర్దిష్టమైన అర్థాన్ని ఇస్తే.. జాతీయ జెండాను ప్టటుకోవడానికి కూడా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. జాతీయ పతాకం ముద్రించి ఉన్న కేకును కోసి తినడాన్ని నేరంగా పరిగణించలేమని చెబుతూ తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి:'ప్రజల జేబులను కొల్లగొడుతున్న ప్రభుత్వం'