Assembly polls 2022: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు శనివారం వర్చువల్ సమావేశాలు నిర్వహించి సమాలోచనలు చేశారు. గత వారం జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఇండోర్ సమావేశాల్లో 300మంది పాల్గొనేందుకు అనుమతిచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఈ సారి ప్రచారంలో ఇంకా కొన్ని సడలింపులు ఇచ్చింది. 500 మంది ప్రజలు హాజరయ్యేందుకు అనుమతించింది. ఇంటింటి ప్రచారంలో ఇప్పటివరకు ఐదుగురికి అనుమతి ఉండగా.. ఇక నుంచి 10మంది వరకు పాల్గొనవచ్చని తెలిపింది. అయితే, తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల/పోటీలో ఉన్న అభ్యర్థులు జనవరి 28 నుంచి బహిరంగ సభలకు అనుమతించింది. అలాగే, రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1నుంచి బహిరంగ సభలకు అనుమతిస్తున్నట్టు స్పష్టంచేసింది. నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం కోసం కొవిడ్ నిబంధనలతో వీడియో వ్యాన్‌లను అనుమతించనున్నట్టు ఈసీ పేర్కొంది.
ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ ప్రక్రియపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు భేటీలో పాల్గొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 8న షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. అదే సమయంలో ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్ ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలపై జనవరి 15వరకు నిషేధం ప్రకటించారు. ఆ తర్వాత కేసులు అదుపులోకి రాకపోగా మరింతగా పెరుగుతుండటంతో ఆ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు 300 మందికి మించకుండా.. 50శాతం ఆక్యుపెన్సీతో ఇండోర్ సమావేశాలు నిర్వహించుకొవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. నిషేధాజ్ఞలు నేటితో ముగుస్తున్నందున సమావేశం నిర్వహించి మరోసారి వాటిని ఈ నెల 31వరకు పొడిగించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'సీఎం అభ్యర్థి నేనే' అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక