Cracks In House Walls Meerut : ఉత్తర్‌ప్రదేశ్.. మీరఠ్‌లో సుమారు 30 ఇళ్లకు పగుళ్లు ఏర్పడడం వల్ల నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో నిద్రపోవాలంటే భయపడుతున్నారు. తమపై గోడలు కూలిపోతాయమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే పగుళ్లు గల కారణాలను గుర్తించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. దీంతో ఐఐటీ రూర్కీ నిపుణుల బృందం విచారణ చేపట్టనుంది.
Meerut House Walls Mystery : మేరఠ్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాలంపాండ ఒకటి. అక్కడ సుమారు 100కు పైగా ఇళ్లు ఉన్నాయి. 20 రోజుల క్రితం.. 30 ఇళ్ల గోడల్లో ఒక్కసారిగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులతోపాటు అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఈటీవీ భారత్ బృందం.. ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులతో మాట్లాడింది.
![Cracks In House Walls Meerut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/19334544_wowow.jpg)
కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో నివాసముంటున్నామని.. కానీ ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురవ్వలేదని స్థానికుడు విపుల్ జైన్ తెలిపాడు. 20 రోజుల క్రితం తన ఇంట్లో పగుళ్లు వచ్చినట్లు చెప్పాడు. పగుళ్లు ఏర్పడిన 25-30 ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయని స్థానిక యువకుడు శివం తాయల్ పేర్కొన్నాడు. "ఇంతకు ముందు ఎప్పుడూ ఈ సమస్య రాలేదు. ఏమవుతుందో తెలియట్లేదు. జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. కానీ కారణాన్ని గుర్తించలేకపోయింది" అని చెప్పాడు.
Meerut House Crack Case : డాలంపాండ ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారని మరో స్థానికుడు శోభిత్ గుప్తా తెలిపాడు. "ప్రభుత్వ యంత్రాంగం త్వరగా ముందడుగు వేయాలి. తొలుత గోడల్లో ఏర్పడిన పగుళ్లు.. ఇప్పుడు నేలపై కూడా కనిపిస్తున్నాయి. అలా ఇల్లంతా కూలిపోయే అవకాశం ఉంది. అది పెనుముప్పుకు దారి తీస్తుంది. రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం. ఉదయం లేచినవెంటనే గోడలను పరిశీలిస్తున్నాం. కొందరు స్థానికులు.. మేస్త్రీలను పిలిపించి ఇళ్లు బాగు చేయించుకున్నారు. కానీ మళ్లీ వాళ్ల ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నాం" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
![Cracks In House Walls Meerut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/19334544_meerut.jpg)
డాలంపాండ పగుళ్ల ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. "30 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని సమాచారం అందిన తర్వాత.. జిల్లా అధికారుల బృందాన్ని అక్కడికి పంపాను. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఎంను ఆదేశించాను. ఆయన అందించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ఐఐటీ రూర్కీకి చెందిన సాంకేతిక నిపుణులతో విచారణ జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పగుళ్లకు గల కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల భద్రతే మాకు ముఖ్యం" అని వివరించారు.
'సబ్సిడెన్సీ జోన్ పరిధిలో 'జోషీమఠ్'.. పగుళ్లు రావడం వెనుక అనేక కారణాలు'
జమ్ముకశ్మీర్‌లో జోషీమఠ్ తరహా ఘటన.. ఇళ్లకు పగుళ్లు.. ఆందోళనలో స్థానికులు