Covishield Vaccine Gap: కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిపై ఎన్టీఏఐజీ(నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్) కీలక ప్రతిపాదనలు చేసింది. కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 8-16 వారాల మధ్యలో రెండో డోసును అందించొచ్చని ప్రతిపాదించింది. అంతకుముందు.. రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చైనా, హాంకాంగ్.. తదితర దేశాల్లో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ సిఫార్సులు చేసింది ఎన్టీఏఐజీ. ప్రపంచ దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కొవిషీల్డ్ టీకా రెండో డోసును.. తొలి డోసు తీసుకున్న 8 వారాల నుంచే అందించడం ద్వారా.. 12-16 వారాల వ్యవధిలో అందించినప్పుడు వచ్చే యాంటీబాడీల స్పందనలో మార్పు లేదని ఆయా అధ్యయనాల్లో వెల్లడైనట్లు వివరించాయి.
అయితే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వ్యవధిపై మాత్రం ఎన్టీఏఐజీ ఎలాంటి కొత్త ప్రతిపాదన చేయలేదు. కొవాగ్జిన్ మొదటి, రెండో డోసు మధ్య ప్రస్తుతం 28 రోజుల విరామం ఉంది.
గతేడాది మే 13న కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఉన్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: 'భారత్లో ఫోర్త్ వేవ్ వచ్చినా బేఫికర్.. మాస్క్ రూల్ సడలించడం బెటర్!'