కరోనా వైరస్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield Vaccine) 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న సమయంలో కొవిషీల్డ్ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15లక్షల మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ నుంచి 93శాతం రక్షణ పొందినట్లు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యులు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98శాతం మందికి మరణం ముప్పు తగ్గిందని పేర్కొన్నారు. కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ సోకకుండా వ్యాక్సిన్లు 100శాతం రక్షణ కల్పించనప్పటికీ వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉందనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తోందని వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
'ఇన్‌ఫెక్షన్ సోకదని ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం గ్యారంటీ ఇవ్వలేదు. కానీ, తీవ్ర అనారోగ్యం బారినపడకుండా నిర్మూలించగలుగుతాయి. అందుచేత వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచడం సహా అప్రమత్తంగా ఉంటూ అత్యంత జాగ్రత్తగా వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని వీకే పాల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 44కోట్ల 19లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం జనాభాలో 9.9కోట్ల మందికి పూర్తిస్థాయిలో (రెండు డోసులు) ఇచ్చినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి : కరోనా వేళ భయపెడుతున్న మరో వ్యాధి