Delhi Covid R-value: దిల్లీ, ముంబయి నగరాల్లో కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ(రీప్రొడక్షన్ నంబరు) 2 దాటిందని పరిశోధకులు తెలిపారు. చెన్నై, పుణె, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్-వ్యాల్యూ ఒకటి దాటినట్లు చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన ఓ బృందం గుర్తించింది.
డిసెంబరు 23-29 మధ్య దిల్లీలో ఈ ఆర్ వ్యాల్యూ 2.54, డిసెంబరు 23-28 మధ్య ముంబయిలో 2.01 ఉన్నట్లు ఆ బృందానికి నేతృత్వం వహించిన సిదంబర సిన్హా పేర్కొన్నారు. ఈ రెండు నగరాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్-వ్యాల్యూ చెన్నైలో 1.26, కోల్‌కతాలో 1.13, పుణె, బెంగళూరు నగరాల్లో 1.11 చొప్పున ఉన్నట్లు వెల్లడించారు.
"అక్టోబరు మధ్య నాటికి అన్ని నగరాల్లో ఆర్-వ్యాల్యూ 1గా ఉంది. అయితే ఒక్కసారిగా దిల్లీ ముంబయి నగరాల్లో అకస్మాత్తుగా కేసులు పెరిగాయి" అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పారు.
దిల్లీలో 1 శాతం దాటిన పాజిటివిటీ రేటు
దిల్లీలో రోజువారీ కొవిడ్ కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 923 కేసులు నమోదయ్యాయి. 2021 మే 30 తర్వాత ఈ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఆరు నెలల తర్వాత పాజిటివిటీ రేటు 1 శాతం దాటింది. డిసెంబరు 23-29 తేదీల మధ్య పాజిటివిటీ రేటు 0.19 నుంచి 1.29కు పెరిగింది.
ముంబయిలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2,510 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదడవం ఇదే తొలిసారి.
ఆర్-వ్యాల్యూ అంటే..
కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందనే దానిపై ఆర్ వ్యాల్యూ ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందితే ఆ విలువ ఒకటిగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఇదీ చూడండి: ఒక్కరోజే 13 వేల కరోనా కేసులు.. ప్రజలకు ఆరోగ్య శాఖ వార్నింగ్!