Covid jn1 Cases in India : దేశంలో కొవిడ్ ఉపరకం జేఎన్ 1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ విషయంలో అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. అధిక సంఖ్యలో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రయోగశాలలకు పంపాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది.
అంతకుముందు కరోనా విజృంభణ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్రం తాజా అడ్వైజరీ జారీ చేసింది. రానున్న పండగల సీజన్‌లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చేపడుతున్న మాక్ డ్రిల్స్‌లో భాగస్వామ్యం కావాలని చెప్పింది.
భారత్ సహా 38 దేశాల్లో జేఎన్ 1 వేరియంట్ ఉందన్న కేంద్రం, అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్ ఉపరకం జేఎన్ 1 వేరియంట్ తొలి కేసు కేరళలో బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందగా అందులో మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 260 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 1,828కి పెరిగినట్లు చెప్పింది.
వారికి మాస్కులు తప్పనిసరి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు సహా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నవాళ్లు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. పక్క రాష్ట్రమైన కేరళలో కొవిడ్ కొత్త ఉపరకం జేఎన్. 1 కేసులు నమోదైన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉన్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
మళ్లీ కరోనా కలకలం.. వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. W.H.O ఏమందంటే?
Covid Cases In India : 236 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసులు.. ముప్పు తప్పదా?