Covid Endemic: ప్రపంచ దేశాలను దాదాపు రెండేళ్లకుపైగా హడలెత్తించిన కరోనా మహమ్మారి చివరి దశకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోయినా.. మహమ్మారి పెద్దగా ప్రభావం చూపడం లేదని అంటున్నారు. దాదాపు నెలరోజుల నుంచి దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య అందుకు నిదర్శనమని చెబుతున్నారు. దాదాపు నెలరోజుల నుంచి రోజువారీ కేసులు 3వేలకు దిగువన నమోదవుతుండగా, మృతుల సంఖ్య పదిలోపే ఉండడమే మహమ్మారి చివరి దశకు చేరిందని చెప్పటానికి సంకేతమన్నారు.
ప్రస్తుతం సీజనల్ ఫ్లూ కేసులు, కరోనా కేసుల విషయంలో ఎలాంటి తేడా లేకపోయినప్పటికీ కొత్త వేరియంట్లపై నిఘా కొనసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా, ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు దాదాపు ఒకేవిధంగా ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. వాటికి చికిత్స చేయొచ్చని ఎయిమ్స్ విశ్రాంత సంచాలకులు రణదీప్ గులేరియా అన్నారు. హై-రిస్క్ గ్రూప్‌లో కరోనా కేసులు తీవ్రంగానే ఉంటున్నాయని చెప్పారు. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో మాదిరిగానే ఈ కేసులను పరిగణించాలని గులేరియా సూచించారు.
ఇది చివరిదశే!
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే మహమ్మారి చివరిదశకు చేరినట్లు స్పష్టమవుతోందని దిల్లీ సఫ్తర్‌జంగ్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్ నీరజ్ గుప్తా తెలిపారు. కరోనాతో ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య, సీజనల్ ఫ్లూ కేసులతో సమానం లేదా తక్కువగా ఉంటున్నట్లు చెప్పారు. కొవిడ్ లక్షణాల గురించి బాగా తెలిసినందున ప్రస్తుతం నమోదవుతున్న కేసులు తేలికపాటివని, ఐసీయూలో చేరాల్సినంత ప్రమాదం లేదనే భావనకు ప్రజలు వచ్చినట్లు డాక్టర్ నీరజ్ గుప్తా తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఇతర ఇన్‌ఫెక్షన్లు అయిన ఇన్‌ఫ్లూయెంజా, నిమోనియా బారినపడకుండా తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నీరజ్ గుప్తా సూచిస్తున్నారు.
అతిగా చర్చించొద్దు
ప్రతి కొత్త వేరియంట్ ఆందోళనకరం కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని అంటువ్యాధుల నిపుణుడు, ఫిజిషియన్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెబుతున్నారు. కొవిడ్ వేరియంట్లు దీర్ఘకాలంపాటు బయటపడుతుంటాయని, వాటిని ట్రాక్ చేసి జినోమ్ సీక్వెన్సింగ్ చేయాలన్నారు. అంతేకానీ కొత్త వేరియంట్ బయటపడినప్పుడల్లా వాటి గురించి తీవ్రంగా చర్చించడంలో తర్కం లేదన్నారు. కొవిడ్ వల్ల కలిగే తీవ్రమైన ముప్పును అధిగమించినందున దేశంలో మహమ్మారి చివరిదశకు చేరుకుందన్నారు. ఇతర వైరస్‌లను కూడా కొవిడ్ మాదిరిగానే ఎదుర్కొవాలని డాక్టర్ లహరియా సూచిస్తున్నారు.
ఏడాదిక్రితం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమని తెలిసిన తర్వాత ఇప్పటివరకు 70 ఉప వేరియంట్లు బయటపడినట్లు ఎన్టీఏజీఐ చీఫ్ ఎన్కే అరోరా తెలిపారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఉప వేరియంట్లలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ గత 9, 10 నెలల కాలంలో కరోనాతో ఆస్పత్రిలో చేరే వారితోపాటు మరణాల సంఖ్యలో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ప్రపంచ దేశాల్లో బయటపడిన ఉప వేరియంట్ల కేసులు దేశంలోనూ నమోదైనా అవి తీవ్రరూపం దాల్చలేదని ఎన్కే అరోరా చెప్పారు. దేశంలో పెద్దఎత్తున టీకా పంపణీ జరగడం సహా సహజ ఇన్‌ఫెక్షన్ వల్ల కరోనా నుంచి పూర్తి భద్రంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా మన చుట్టూనే ఉందని, అది తీవ్రరూపం దాల్చి ఆందోళన చెందే పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. బయటి నుంచి ఎలాంటి ఇన్‌ఫుట్‌లు లేకుండా ఒక భౌగోళిక ప్రాంతంలో వైరస్ కనీస స్థాయిలో ఉంటే మహమ్మారి చివరిదశకు చేరినట్లుగా భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: పంజాబ్లో ఇమ్రాన్ ఖాన్ బ్యానర్ కలకలం.. ఏం జరిగింది?