Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కొత్తగా 41,434 కేసులు బయటపడ్డాయి. 9,671 మంది కోలుకోగా 13 మంది మృతిచెందారు. ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ముంబయిలోని ధారావిలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో యాక్టివ్ కేసుల సంఖ్య 729కి చేరింది.
మరోవైపు రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 1009కి చేరాయి. జనవరి 10 వరకు మహారాష్ట్రలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నలుగురికి మించి ఎక్కువమంది కలిసి సంచరించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను ఫిబ్రవరి 15 వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, స్పాలు, బ్యూటీ సెలూన్లు, మ్యూజియాలు, ఎంటర్టైన్మెంట్ జోన్లను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. సెలూన్లు మాత్రం 50 శాతం మందితో నడుపుకోవచ్చని తెలిపింది.
- ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్ అని తేలింది.
- దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 20,181 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
- బంగాల్లో కొత్తగా 18,802 కేసులు నమోదు అయ్యాయి. 8,112 మంది రికవరీ అయ్యారు. 19 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,055 ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 29.6 శాతంగా నమోదు అయ్యింది.
- కర్ణాటకలో మొత్తం 8,906 కొత్త వైరస్ కేసులు వెలుగు చూశాయి. 508 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 38,366కు చేరింది. 38 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- బెంగళూరులో పాజిటివిటీ రేటు పది శాతానికి పైగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. నగరంలో కొత్తగా 7,113 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు.
- కేరళలో ఒక్కరోజే 5,944 కేసులు నిర్ధరణ అయ్యాయి. 2,463 మంది రికవరీ అయ్యారు. మరో 33 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 31,098గా ఉంది. 49,547 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
- పుణెలో మరో 60 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు. దీంతో శాఖలో మొత్తం కేసుల సంఖ్య 185కు చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 27 మంది ఉన్నతాధికారులు కాగా.. మరో 158 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.
- ఉత్తరాఖండ్లో వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనవరి 15 వరకు రాజకీయ, మత, సామాజిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
- గుజరాత్లో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్, సూరత్ నగరంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది.
- పెరుగుతున్న కేసులు వలస కార్మికుల్లో ఆందోళన కలగజేశాయి. దీంతో చాలా మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. పెద్ద సంఖ్యలో కార్మికులు సూరత్ రైల్వే స్టేషన్కు తరలివస్తున్నారు.
- గుజరాత్లో కొత్తగా 32 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 236కి చేరింది.
ఇదీ చూడండి: భారీగా మంచు కురుస్తున్నా.. గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన సైనికులు