Covid Cases in India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కర్ణాటకలో ఒక్కరోజే 50,210 మంది వైరస్ బారిన పడ్డారు. శనివారంతో పోలిస్తే.. కొత్త కేసులు 7,740 అధికంగా నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివిటీ రేటు 22.77 శాతానికి పెరిగింది. వైరస్ ధాటికి 19 మంది చనిపోయారు. 22,842 మంది కోలుకోగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,57,796కు చేరింది.
ఒక్క బెంగళూరులోనే కొత్తగా 26,299 మందికి కరోనా సోకింది. ఫలితంగా నగరంలో క్రియాశీలక కేసుల సంఖ్య 2 లక్షల 31 వేలు దాటింది.
కేరళలో ఉద్ధృతం
కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 45,449 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 56,20,151కి చేరింది. మరో 77 మంది మృతి చెందారు. ఫలితంగా మరణాల సంఖ్య 51,816కు పెరిగింది.
తగ్గిన కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 40,805 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,93,305కు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 44 మంది మృతి చెందారు. 27,377 మంది కోలుకున్నారు. ముంబయిలోనూ కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తమిళనాడులో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 30,580 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,00,954కు చేరింది. మరో 40 మంది మరణించారు.
10 వేల దిగువకు..
దిల్లీలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా 9,197 మందికి వైరస్ సోకింది. దీంతో పాజిటివిటీ రేటు 13.32 శాతానికి తగ్గింది. మరో 34 మంది చనిపోయారు.
జనవరి 13న రికార్డు స్థాయిలో 28,867 కేసులు నమోదవగా.. కేవలం పది రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 10 వేల దిగువకు తగ్గడం ఊరట కలిగించే విషయం.
వివిధ రాష్ట్రాల్లో శనివారం నమోదైన కేసుల వివరాలు..
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
కర్ణాటక | 50,210 | 19 |
మహారాష్ట్ర | 40,805 | 44 |
తమిళనాడు | 30,580 | 40 |
గుజరాత్ | 16,617 | 19 |
ఆంధ్రప్రదేశ్ | 14,440 | 04 |
రాజస్థాన్ | 14,112 | 19 |
మధ్యప్రదేశ్ | 11,253 | 08 |
దిల్లీ | 9,197 | 34 |
ఒడిశా | 8,520 | 06 |
హరియాణా | 7,516 | -- |
బంగాల్ | 6,980 | 36 |
జమ్ముకశ్మీర్ | 6,253 | 07 |
పంజాబ్ | 5,664 | 30 |
ఛత్తీస్‌గఢ్ | 3,841 | 11 |
తెలంగాణ | 3,603 | 01 |
బిహార్ | 2,768 | 02 |
అసోం | 2,277 | 13 |
హిమాచల్‌ప్రదేశ్ | 755 | 02 |
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం. గర్భిణీ, డయాబెటిస్ బాధితులకు విధులకు హాజరవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇదీ చూడండి: పిల్లలపై మంత్రి కుమారుడి కాల్పులు.. అనేక మందికి గాయాలు!