Covid Cases in India: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజు 45వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 46,406 మందికి పాజిటివ్ అని నిర్ధరణ కాగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 34,658 మంది కోలుకున్నారు.
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
మహారాష్ట్ర | 46,406 | 36 |
దిల్లీ | 28,867 | 31 |
బంగాల్ | 23,467 | 26 |
కర్ణాటక | 25,005 | 8 |
తమిళనాడు | 20,911 | 25 |
కేరళ | 13,468 | 117 |
ముంబయి | 13,702 | 6 |
గుజరాత్ | 11,176 | 5 |
రాజస్థాన్ | 9,881 | 7 |
గోవా | 3,728 | 4 |
చండీగఢ్ | 1,338 | - |
జైలులో కొవిడ్ కలకలం
తిహాడ్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ఖైదీల సంఖ్య 85కు చేరింది. మరోవైపు జైలు స్టాఫర్లలో కరోనా సోకిన వారి సంఖ్య ఈనెల 10 నాటికి 48గా ఉండగా ఇప్పుడు అది కాస్త 75కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం కరోనా సోకిన ఖైదీలు, స్టాఫర్లు క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
30 మంది జవాన్లకు కరోనా
గుజరాత్ పౌరీ జిల్లాలోని కొట్ద్వార్లో ఎలక్షన్ డ్యూటీలో భాగంగా వచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లలో 30 మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన జవాన్లను ఐసోలేషన్‌కు తరలించామని అధికారులు తెలిపారు.
అసోం గవర్నర్‌కు కరోనా
అసోం, నాగాలాండ్ గవర్నర్ జగదీశ్ ముఖీకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. గవర్నల్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు పంజాబ్ ఆమ్ఆద్మీ ఎమ్మెల్యే అమన్ అరోడాకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఒమిక్రాన్ కేసులు
దేశవ్యాప్తంగా బుధవారం 1,94,720 కరోనా కేసులు బయటపడ్డాయి. కొవిడ్ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్‌ను జయించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,32,024 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కు చేరింది.
ఇదీ చూడండి : 'ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దు'