సమానత్వంతో, వివక్షతకు తావులేని లేని విధంగా టీకా విధానాన్ని రూపొందించినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు లేవనెత్తిన సమస్యలపై స్పందనగా 200 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. టీకా విధానాన్ని పూర్తిగా వెనకేసుకొచ్చింది. దీనిపై న్యాయస్థానాల జోక్యం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంది.
దేశంలోని పౌరులందరికీ ఒకేసారి అందించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చిచెప్పింది. డోసుల లభ్యత, ముప్పు పొంచి ఉన్నవారికి ప్రాధాన్యం వంటి విషయాలపై టీకా పంపిణీ ఆధారపడి ఉంటుందని తెలిపింది. తమ టీకా విధానం రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. నిపుణులతో సవివర చర్చలు జరిపిన తర్వాతే ఈ విధానంపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
"కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు ఈ స్థాయిలో పోరాడుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కార్యనిర్వాహక శాఖకు ఈ విషయంపై పూర్తి స్వేచ్ఛ ఉంది. మంచికోసమైనప్పటికీ... నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలను, కార్యనిర్వాహక శాఖను పట్టించుకోకుండా.. అతిగా జోక్యం చేసుకుంటే అనుకోని, అనాలోచిత పర్యవసనాలకు దారితీస్తుంది. అసాధారణ పరిస్థితుల్లో ఈ కార్యనిర్వాహక విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విషయంలో కార్యనిర్వాహక స్వేచ్ఛను విశ్వసించాలి."
-అఫిడవిట్లో కేంద్రం
విచారణ వాయిదా
సాంకేతిక కారణాలతో సోమవారం జరగాల్సిన విచారణనను మే 13కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కరోనా వేళ అత్యవసరాల సరఫరాకు సంబంధించిన కేసులపై సోమవారం.. ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం తమ సర్వర్లు పనిచేయడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ఎన్ రావ్, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులందరు కలిసి ఈ కేసుపై గురువారం వాదనలు వినాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
మీడియాలోనే ముందు!
సాంకేతిక సమస్య తలెత్తక ముందు వాదనలు ప్రారంభించిన జస్టిస్ చంద్రచూడ్.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ గురించి తమ కంటే ముందే మీడియాకు తెలిసిందని పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులకు అఫిడవిట్ సోమవారం ఉదయం అందిందని తెలిపారు. 'నాకు అఫిడవిట్ రాత్రే వచ్చింది. కానీ నా సహచర న్యాయమూర్తులు ఉదయం తీసుకున్నారు. అఫిడవిట్ నాకు లభించకముందే వార్తల్లో దాని గురించి చదివాను' అని ఓ వార్తా కథనాన్ని ప్రస్తావించారు జస్టిస్ చంద్రచూడ్.
అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తాము ఆ కాపీని.. కేంద్రానికి పంపించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. అది మీడియాకు ఎలా వెళ్లిందో తెలీదని అన్నారు.
అయితే, విచారణ వాయిదా వేసిన సుప్రీం.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పూర్తిగా పరిశీలించేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటామని తెలిపింది. ప్రభుత్వ వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు అమికస్ క్యూరీకి సైతం తగిన సమయం ఉంటుందని పేర్కొంది.