భారత్‌లో నెలన్నర రోజులుగా కరోనా కేసులకంటే వైరస్ నుంచి రికవరీ అవుతున్నవారే ఎక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గత 11రోజులుగా కొత్త కేసులు 50వేల కంటే తక్కువే నమోదవుతున్నాయని వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుత రికవరీ రేటు 93.52గా పేర్కొంది. మంగళవారం మొత్తం 44,739మంది కరోనా నుంచి కోలుకోగా 38,617కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఓవైపు యూరోప్, అమెరికా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉండటం సుభసూచకమని పేర్కొంది.
ఆ రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికం
దేశంలో 74.98శాతం రికవరీ కేసులు కేవలం 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేరళలో అత్యధికంగా ఒక్కరోజులోనే 6,620మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 5,123, దిల్లీలో 4,421 రికవరీ కేసులు నమోదయ్యాయి.
అధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు
మొత్తం కరోనా కేసుల్లో దాదాపు 76.15శాతం కేసులు 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో అత్యధికంగా ఒక్కరోజులోనే 6,396 కేసులు నమోదవ్వగా , కేరళలో 5,792, పశ్చిమ బంగాలో 3,654కేసులు వెలువడ్డాయి.
మరణాల్లో..
మరణాలు దిల్లీలోనే అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే దిల్లీలో 99మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో 68, బంగాలో 52మంది వైరస్ బారిన పడి మరణించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 89,12,907గా ఉంది. వైరస్‌తో మరణించినవారి సంఖ్య 1,30,993గా నమోదైంది.