మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ టీకాల కొరత వేధిస్తోంది. సరిపడా టీకాలు లేక ముంబయిలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. కొన్ని కేంద్రాల్లో టీకాలు లేవని బోర్డులు దర్శనమిచ్చాయి. వ్యాక్సిన్ వేయించుకుందామని వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.
బీకేసీలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కేంద్రం సహా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముంబయిలో ఉన్న 120 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 75 కేంద్రాలను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు చెప్పారు. ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి తలెత్తింది. కరోనా టీకాల కొరత ఉందని ఇప్పటికే కేంద్రంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది.
ముంబయిలో టీకా పంపిణీకి కొత్తగా 1.80 లక్షల డోసులను కేంద్రం శుక్రవారం అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కేంద్రం ఆరోపణలు అవాస్తవం..
మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలకు పైగా డోసులను వృథా చేసిందని కేంద్రం చేస్తున్న ఆరోపణలను ఖండించారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే. కేంద్రం పేర్కొన్నది జాతీయ సగటు శాతం అని.. మహారాష్ట్రలో ఆ శాతం అందులో సగం కూడా ఉండదన్నారు.
ఇదీ చదవండి : బీడువారిన సింగూరు బతుకులు!