దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నివారణ చర్యల్లో భాగంగా భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి స్థాయిని సెప్టెంబరుకల్లా నెలకు 10 కోట్ల డోసుల తయారీ స్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాఫ్‌కైన్‌తో పాటు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బులంద్‌షెహర్‌లోని భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్‌లోనూ కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కొవిడ్ సురక్ష కింద కొవాగ్జిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడం కోసం వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు పేర్కొంది. దీనివల్ల కొవాగ్జిన్ ఉత్పత్తి మే-జూన్‌కల్లా రెట్టింపు అవుతుందని, జులై-ఆగస్టుకల్లా 6-7 రెట్లకు చేరుతుందని వెల్లడించింది. ప్రస్తుతం నెలకు కోటి డోసులున్న ఉత్పత్తి సామర్థ్యం జులై-ఆగస్టు నాటికి 6-7 కోట్ల డోసులకు చేరుతుందని, సెప్టెంబర్‌నాటికల్లా 10 కోట్ల డోసులకు పెరుగుతుందని వివరించింది.
ఆర్థికంగా చేయూత
భారత్ బయోటెక్ సంస్థ బెంగళూరులో కొత్తగా టీకా ఉత్పత్తి చేయడం కోసం కేంద్రం గ్రాంటు రూపంలో రూ.65 కోట్లు మంజూరు చేయనుందని బయోటెక్నాలజీ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం బెంగళూరులో ఆ సంస్థకున్న యూనిట్‌ను కొవాగ్జిన్ టీకా ఉత్పత్తికి వీలుగా మారుస్తున్నట్లు తెలిపింది. అలాగే ముంబయిలోని మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ హాఫ్‌కైన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్‌లోనూ టీకా ఉత్పత్తికి రూ.65 కోట్ల గ్రాంటును కేంద్రం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్‌ను కొవాగ్జిన్ టీకా తయారీకి వీలుగా ఆరు నెలల్లోపే సిద్ధం చేయాలని సూచించినట్లు బయోటెక్నాలజీ విభాగం తెలిపింది. హైదరాబాద్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, బయోటెక్నాలజీ విభాగం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షెహర్‌లోని భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్‌కూ కేంద్రం ఆర్థిక మద్దతు ఇవ్వనుంది.
ఇవీ చదవండి: