నిందితులకు బెయిల్ ఇచ్చేముందు నేర తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టులను ఆదేశించింది సుప్రీంకోర్టు. డౌరీ డెత్ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది.
"కట్నం కోసం ఓ మహిళను వేధించారు. ఆమె మరణానికి స్వయంగా కారకులయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని కోర్టులు ఓ నిర్ణయానికి రావాలి" అని జస్టిస్ ఎమ్ ఆర్ షా అన్నారు. కారణం లేకుండా బెయిల్‌పై ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొన్నారు.
రూ. 15 లక్షలు, ఓ ద్విచక్ర వాహనం ఇచ్చినప్పటికీ మరింత కట్నం ఆశించి బాధితురాలు మృతికి కారణమైన నిందితుడిపై కేసు నమోదైంది. బాధితురాలి తమ్ముడు ఈ కేసు పెట్టారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి నిందుతుడికి బెయిల్ ఇస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
సర్క్యులర్ విడుదల...
వేసవి సెలవుల నేపథ్యంలో.. అత్యవసర కేసులపై విచారణ జరిపేందుకు వెకేషన్ బెంచీలకు సర్క్యులర్ విడుదల చేసింది సుప్రీంకోర్టు. వివిధ కేసులను లిస్టింగ్ చేయడం గురించి సర్క్యులర్‌లో పేర్కొంది. మే 26 నుంచి జూన్ 2 వరకు వర్చువల్‌గా విచారణ జరిపే న్యాయమూర్తుల బెంచీల కోసం ఈ సర్క్యులర్ విడుదల చేసినట్లు పేర్కొంది.
రెండు డివిజన్ బెంచ్‌లు ఈ వ్యవధిలో కేసు విచారణ జరపనున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్ మొదటి బెంచ్కాగా.. రెండో బెంచీలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారని తెలిపింది.