దేశాలు చుట్టి రావాలంటే రాజకీయ నాయకులు, సినీ తారలే కానక్కర్లేదు. కోట్లకు అధిపతి అవ్వాల్సిన పనీ లేదు. మనం తలుచుకోవాలే గానీ.. ఏదైనా సాధ్యమే. ఈ వృద్ధ జంటే అందుకు నిదర్శనం.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొచ్చిలో ఓ చిన్న కాఫీ కొట్టు నడిపే వృద్ధ దంపతులు కేఆర్ విజయన్(71) తన భార్య మోహనతో(69) కలిసి ఇప్పటివరకు 25 దేశాలు చుట్టి వచ్చి ఔరా అనిపించారు. కరోనా మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత.. ఇప్పుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొచ్చిలో 27 సంవత్సరాలుగా.. 'శ్రీ బాలాజీ కాఫీ హౌస్' నడుపుతున్నారు విజయన్ దంపతులు. షాప్ బాగానే నడుస్తుంది. ఈ క్రమంలోనే వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశాలు చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు.
పుతిన్‌ను కలవాలని..
ఈ నెల 21న రష్యాకు పయనం కానున్నారు విజయన్ దంపతులు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుసుకోవాలనేది వీరి ఆశయం.
2007లో తొలిసారి ఇజ్రాయెల్ వెళ్లారు. చివరగా 2019 నవంబర్-డిసెంబర్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. స్వయంగా తన డబ్బులతో వీరిని ఈ టూర్‌కు పంపించడం విశేషం.
పైసాపైసా కూడబెట్టి ఈ 12 సంవత్సరాలలో ఇజ్రాయెల్, అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలనూ చుట్టొచ్చారు.
ఆంగ్లంపై అవగాహన అంతంతమాత్రంగానే ఉన్న కారణంగా.. ట్రావెల్ ఏజెన్సీలతో కలిసి వీరు తమ పర్యటనకు వెళ్తుంటారు. ఈ రష్యా పర్యటనకు తమతో పాటు తమ మనుమలు, మనుమరాళ్లు కూడా వస్తున్నట్లు విజయన్ చెప్పుకొచ్చారు.
''కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాక.. పర్యటక ప్రాంతాలు తెరుచుకున్నట్లు మేం చదివాం. ట్రావెల్ ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు. తదుపరి పర్యటన రష్యా అని చెప్పాడు. మా పేర్లు తొలుత చేర్చమని నేను చెప్పా. అక్టోబర్ 21న పర్యటన ప్రారంభం అవుతుంది. 28న ముగుస్తుంది.''
- కేఆర్ విజయన్
ఇవీ చూడండి: రాత్రి వేళల్లో గంటకో కప్పు కాఫీ.. ఆరోగ్యానికి హానికరం