Couple suicide along with baby in chevella : ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు.. ఇలా కారణాలేవైనా సరే.. ఈ మధ్య తరచూ కుటుంబ ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కసారే పక్కా ప్రణాళికా ప్రకారం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల అనాలోచిత.. క్షణికావేశ నిర్ణయాల వల్ల వయసొచ్చిన పిల్లలే కాదు.. పసికందుల ప్రాణాలు కూడా బలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Couple suicide along with baby in Rangareddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో అశోక్, అంకిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ జంట ఉమ్మడి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అశోక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. అతడి తమ్ముడు రాఘవేందర్ అశోక్‌కు సాయంగా ఉంటున్నాడు. మరోవైపు అంకిత ఇంటి పనుల్లో బిజీగా ఉంటోంది. అశోక్ అంకితల ప్రేమగా గుర్తుగా మూడు నెలల క్రితం ఓ చిన్నారి జన్మించింది.
ఇంట్లో పసిపాప అడుగుపెట్టగానే ఆ ఉమ్మడి కుటుంబం ఎంతో సంతోషించింది. ఆ బుజ్జాయికి మూడు నెలలు వచ్చాయి. ఈ మూణ్నెళ్లు ఆ కుటుంబమంతా ఆ చిన్నారి చేసే అల్లరితో హాయిగా గడిపింది. ఎంతో సంతోషంగా కలిసి జీవిస్తున్న ఆ కుటుంబంలో ఇవాళ అకస్మాత్తుగా ఓ విషాదం చోటుచేసుకుంది. అశోక్, అంకిత దంపతులు తమ మూణ్నెళ్ల గారాలపట్టిని చంపేసి వారూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దేవరంపల్లి గ్రామంలో పలువురు రైతులు పండించిన కూరగాయల లోడ్‌ను తీసుకుని అశోక్, అతడి సోదరుడు రాఘవేందర్ హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌కు వచ్చారు. తిరిగి ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటికి చేరుకున్నారు. వేసవి కావడంతో ఇంటి బయట మంచం వేసుకుని రాఘవేందర్ పడుకోగా.. అశోక్ తన గదికి వెళ్లాడు. అనంతరం తన భార్య అంకితతో కలిసి మూణ్నెళ్ల తమ కూతుర్ని చంపేశాడు. అనంతరం భార్యకు ఉరి వేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆరు గంటల సమయంలో అన్నావదినెలు ఇంకా లేవలేదని.. రోజూ తెల్లవారుజామునే లేచి ఏడిచే చిన్నారి కూడా చడీచప్పుడు లేకుండా పడుకుందని అనుమానం వచ్చిన ఆ కుటుంబ సభ్యులు అశోక్ గది తలుపులు కొట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టారు. తీరా వెళ్లి చూస్తే అశోక్-అంకితలు ఉరి వేసుకుని కనిపించారు. మరోవైపు చిన్నారి విగత జీవిగా పడి ఉండటం కనిపించింది. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్దామనుకోగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారని గమనించారు. ఎలాంటి కలతలు లేకుండా హాయిగా సాగిపోతున్న తమ ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు-కోడలు.. వారి కుమార్తె మరణంతో విషాద చాయలు అలుముకున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఘటనకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.