దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని దిల్లీకి వచ్చేవారికి కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది దిల్లీ ప్రభుత్వం. 72 గంటల్లోగా చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 26 నుంచి మార్చి 15 వరకు ఇది అమలులో ఉండనుంది.
దిల్లీకి విమానాల్లో, రైళ్లలో, బస్సుల్లో వచ్చేవారికి ఈ నిబంధన వర్తించనుంది. కారుల్లో వచ్చేవారికి దీని నుంచి మినహాయింపు ఉంది. కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించనివారికి అక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్‌గా తేలితే 14 రోజుల పాటు క్వారెంటైన్‌కు పంపించనున్నారు.
దేశంలో కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇటీవల భారీ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 86 శాతం ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయని కేంద్రం లెక్కల ద్వారా తెలిసింది.
ఇదీ చదవండి:'మార్చి 1 నుంచి వారందరికీ కరోనా టీకా'