భారత్‌లో పలు రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 41,457 మందికి వైరస్ సోకింది. వాటిలో ఒక్క బెంగళూరులోనే 25,595 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివిటీ రేటు 22.30 శాతానికి పెరిగింది. వైరస్ ధాటికి మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,353 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,381కి చేరింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. క్రితం రోజు కంటే 26 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 39,207 కేసులు నమోదయ్యాయి. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. 38 వేల మందికిపైగా కోలుకున్నారు.
కేరళలోనూ కొవిడ్ పంజా విసురుతోంది. కొత్తగా 28,481 కేసులు నమోదయ్యాయి. కొత్త మార్గదర్శకాల సవరించిన లెక్కలతో మరో 83 మంది మరణించారని అధికారులు తెలిపారు. 7,303 మంది కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసులు సంఖ్య 1,42,512కు చేరింది.
ముంబయిలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 6,149 మంది వైరస్ బారిన పడ్డారు. మరో ఏడుగురు మృతి చెందారు.
అయితే దిల్లీలో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. తాజాగా 11,684 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పాజిటివిటీ రేటు క్రితం రోజుతో పోల్చుకుంటే 5.52 శాతం తగ్గి.. 22.47 శాతానికి దిగొచ్చింది. మరో 38 మంది చనిపోయారు.
వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసుల వివరాలు..
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
కర్ణాటక | 41,457 | 20 |
మహారాష్ట్ర | 39,207 | 53 |
దిల్లీ | 11,684 | 38 |
కేరళ | 28,481 | 83(సవరించిన తర్వాత) |
తమిళనాడు | 23,888 | 29 |
గుజరాత్ | 17,119 | 10 |
ఉత్తర్‌ప్రదేశ్ | 14,803 | 12 |
బంగాల్ | 10,430 | 34 |
అసోం | 8,072 | 16 |
మధ్యప్రదేశ్ | 7,154 | 02 |
ఆంధ్రప్రదేశ్ | 6,996 | 04 |
జమ్ముకశ్మీర్ | 4,651 | 03 |
తెలంగాణ | 2,983 | 02 |
బిహార్ | 4,551 | -- |
ముంబయి | 6,149 | 07 |
- ఒడిశా భువనేశ్వర్ ఎయిమ్స్‌లో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 300 మందికిపైగా వైద్యులు సహా సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు.
ఇదీ చూడండి: Live Video: బిజీ రోడ్డుపై ఏనుగు పరుగు- ముగ్గురికి గాయాలు