Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 34,047 మందికి వైరస్ సోకగా.. 13 మంది మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే 21,071 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఐదుగురు మరణించారు. నగరంలో ప్రస్తుతం 1,46,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. తాజాగా 41,327 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ ధాటికి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయిలోనే 7,895 మందికి కొవిడ్ సోకగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరో 8 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
దిల్లీలో ఇవాళ 18 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో జైళ్లలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సిబ్బందితో పాటు ఖైదీలకు కరోనా బారిన పడుతున్నారు. కొత్తగా 99 మంది ఖైదీలు.. 88 మంది సిబ్బందికి వైరస్ సోకింది.
రాష్ట్రాలవారీగా కొత్త కేసుల వివరాలు..
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
మహారాష్ట్ర | 41,327 | 11 |
కర్ణాటక | 34,047 | 13 |
తమిళనాడు | 23,975 | 22 |
దిల్లీ | 18,286 | 28 |
కేరళ | 18,123 | 08 |
ఉత్తర్‌ప్రదేశ్ | 17,185 | 10 |
బంగాల్ | 14,938 | 36 |
ఒడిశా | 11,177 | 03 |
గుజరాత్ | 10,150 | 08 |
రాజస్థాన్ | 9,669 | 06 |
హరియాణా | 8,900 | 06 |
మధ్యప్రదేశ్ | 6,380 | 02 |
బిహార్ | 5,410 | 09 |
ఆంధ్రప్రదేశ్ | 4,570 | 01 |
జమ్ముకశ్మీర్ | 3,449 | 06 |
గోవా | 3,232 | 07 |
తెలంగాణ | 2,047 | 03 |
చండీగఢ్ | 1,358 | -- |
సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా
Mammootty Tests Positive: మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. 70 ఏళ్ల మమ్ముట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొవిడ్ మహమ్మారి బారినపడినట్టు తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు ఇలా..
కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
- కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు 10, 11, 12 తరగతుల విద్యార్థులకూ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది.
- కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూతో రాజస్థాన్‌లో ఆదివారం మార్కెట్లను మూసేశారు. పాలు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతి ఇవ్వడంతో అవి మినహా మార్కెట్లో మరే ఇతర దుకాణాలూ తెరుచుకోలేదు. మరోవైపు వారాంతపు కర్ఫ్యూ ఉల్లంఘనలను నివారించేందుకు పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యాలయాల మూసివేతను ఈ నెల 23 వరకు పొడిగించారు. అయితే ఆన్లైన్ తరగతులు కొనసాగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూబెల్లా టీకా తీసుకొని ముగ్గురు శిశువులు మృతి