Coonoor helicopter crash: కూనూర్ ఘటనతో దేశం ఒక్కసారి షాక్‌కు గురైంది. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మరికొందరు సైనిక అధికారులు మరణించడం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే హెలికాప్టర్ ప్రమాదాలు గతంలో ఎన్నో జరిగాయి. వాటిల్లో అనేకమంది సైనిక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందురు.. మృత్యువు అంచు వరకు వెళ్లి బయటపడ్డారు. ఈ వివరాలు..
1963 నవంబర్ 22: ఆరుగురు మిలిటరీ అధికారులు ప్రయాణిస్తున్న విమానం.. జమ్ముకశ్మీర్ పూంచ్ ప్రాంతంలో కుప్పకూలింది. లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ విక్రమ్ సింగ్, ఎయిర్ వైస్ మార్షల్ ఈడబ్ల్యూ పింటో, మేజర్ జనరల్ కేఎన్‌డీ నానావతి, బ్రిగేడియర్ ఎస్ఆర్ ఒబెరాయ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ఎస్ సోదీ.. ఈ ఘటనలో మరణించారు. దేశ మిలిటరీ చరిత్రలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటి!
1952: భారత సైన్యానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు ప్రయాణిస్తున్న విమానం లఖ్‌నవూకు సమీపంలో కూలింది. ఈ ఘటనను '1953 దేవోన్ క్రాష్'గా పిలుస్తారు. ప్రమాదం సమయంలో లెఫ్టినెంట్ జనరల్, నాటి వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ఛార్జ్ ఎస్ఎమ్ శ్రీనాగేశ్, నాటి క్వార్టర్‌మాస్టర్ జనరల్, మేజర్ జనరల్ కేఎస్ తిమ్మయ్య, మేజర్ జనరల్ ఎస్పీపీ థారొట్, మేజర్ జనరల్ మోహిందర్ సింగ్ చోప్రా, మేజర్ జరనల్ సర్దానంద్ సింగ్, బ్రిగేడియార్ అజాయిబ్ సింగ్ విమానంలో ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని కొద్దిసేపటి ముందే పసిగట్టి, చాకచక్యంగా వ్యవహరించిన దేవోన్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్, ఫ్లైట్ లెఫ్టినెంట్ సుహాస్ విశ్వాస్‌కు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ.. అశోక చక్ర పురస్కారాన్ని ఇచ్చింది కేంద్రం.
2019: పూంచ్‌లో సైన్యం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో మాజీ నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంటర్ జనరల్ రణ్‌బీర్ సింగ్‌తో పాటు మరో ఎనిమిది మంది సైనిక సిబ్బంది గాయాలతో బయటపడ్డారు.
2021 డిసెంబర్ 8: యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ఆయన సీడీఎస్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరు.
ఇవీ చూడండి:-