Controversies on TTD Nitya Annadanam in Tirumala: తిరుమల పేరు చెప్పగానే ఆ దేవదేవుడిపై భక్తుల్లో ఎంతో విశ్వాసం, నమ్మకం. తిరుమల వచ్చే భక్తులు ఎంతటి వారైనా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఆ అన్నప్రసాదానికి ఎంతో గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమస్థానంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే తిరుమల లడ్డూ ప్రసాదం అంటే దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదం నాణ్యత కూడా తగ్గించేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటోంది.
తిరుమల దేవస్థానంలో ఎంతో పవిత్రమైన హోదాగా భావించే టీటీడీ ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమలలో ఓ బాలికను చిరుత హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా నడక దారిలో ఇనుప కంచెలు ఎర్పాటు చేయకుండా కర్రలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా టీటీడీ పాలన యంత్రాంగం ప్రవర్తిస్తోందని విమర్శలు తలెత్తుతున్నాయి.
TTD Nitya Annadanam: తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. టీటీడీ అందించే భోజనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకమైన ఆహార అందిస్తుండటంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నిరసన వ్యక్తం చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం నాణ్యత సరిగా లేదని కొంతమంది భక్తులు టీటీడీ సిబ్బందిపై తిరగబడ్డారు. అన్నదాన సత్రానికి వచ్చిన భక్తులు సిబ్బంది వడ్డించిన అన్నం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇది అన్నమా ఎవరూ తినలేకపోతున్నారని ఆగ్రహంచారు. అన్నప్రసాదం దారుణంగా ఉంది చాలామంది ఆకుల్లో వదిలేశని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణానికి అన్నం ఆరిపోయి అలా అయిందని ఉద్యోగి చెప్పగా భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కోట్ల రూపాయలు కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అని ప్రశ్నించారు. అన్నప్రసాదాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.
తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం
తరచూ ఫిర్యాదులు మిల్లర్ల నుంచి కొనుగోలేదీ: అన్నప్రసాదం నాణ్యతపై టీటీడీ అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. టీటీడీ డయల్ యువర్ ఈవో, సోషల్ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావిస్తుండటంతో ప్రస్తుతం బియ్యం దిగుమతి చేసుకుంటున్న గుత్తేదారుల నుంచి కాకుండా మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. కానీ ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు. బియ్యం నుంచి నిత్యావసర సరకుల వరకు ప్రతీ వస్తువు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తామని టీటీడీ అధికారులు చెప్తున్నా అన్నప్రసాదం నాణ్యతపై విమర్శలు తప్పడం లేదు.
Lokesh on Annadanam controversy: ఇటీవల చిన్నారిని చిరుతపులి చంపేస్తే ఆ కుటుంబానికి కొంత పరిహారం ఇవ్వాలని న్యాయస్థానం టీటీడీని ఆదేశించింది. అది ఇవ్వకపోగా వైసీపీ ఎమ్మెల్యేలు చిన్నారి తల్లిదండ్రులను బెదిరించడం దారుణమని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చే టీటీడీ దగ్గర రూ 5 లక్షలు లేవా అని ప్రశ్నించారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు టిఫిన్, పిల్లలకు పాలు ఇవ్వడం కూడా ఆపేశారని ఆరోపించారు. లడ్డూ నాణ్యత తగ్గించి ధర పెంచేశారు. గదుల అద్దె పెంచారు ఇలాంటి చర్యలన్నీ భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్రలు కావా అని లోకేశ్ నిలదీశారు.
తిరుమలను వైసీపీ ఆదాయ వనరుగా చూస్తోంది - ₹400కోట్లకు పైగా నిధులు పక్కదారి : లంకా దినకర్
TTD Chairman on Annadanam controversy: అన్నప్రసాదం వివాదంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. తిరుమలకు రోజూ వచ్చే భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమస్థానంలో ఉందని అన్నారు. కొందరు మాత్రమే మిగిలిన భక్తులను రెచ్చగొట్టేలా మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. పొరపాట్లు ఉంటే ఇకపై సరిదిద్దుకుంటామని తెలిపారు.