Amitabh Bachchan ex body guard suspend: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన ముంబయి పోలీస్ కానిస్టేబుల్ జితేంద్ర శిందేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనుచిత ప్రవర్తన సహా.. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో అతడిని విధుల్లోంచి తొలగించారు.
Constable Jitendra Shinde
గతంలో ముంబయి పోలీసు విభాగంలోని సెక్యూరిటీ బ్రాంచ్‌లో పనిచేశాడు శిందే. 2015 నుంచి 2021 ఆగస్టు వరకు అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డ్‌గా వ్యవహరించాడు. అయితే, శిందేకు సంబంధించిన అనేక అక్రమాలు ఇటీవల బయటపడ్డాయి. వీటిని చూసి ఉన్నతాధికారులే విస్మయానికి గురయ్యారు.
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ.. ఆదాయం రూ.కోట్లలో..
సాధారణ కానిస్టేబుల్‌గా ఉన్న జితేంద్ర శిందే వార్షికాదాయం రూ.1.5 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విదేశీ టూర్లకు వెళ్తున్నాడని చెప్పారు. కనీసం నాలుగు సార్లు దుబాయ్, సింగపూర్‌కు వెళ్లాడని తెలిపారు.
"సర్వీస్ రూల్స్ ప్రకారం విదేశీ ప్రయాణాలు చేసే ముందు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శిందే అలా చేయలేదు. అంతేకాదు, తన భార్య పేరు మీద ఓ సెక్యూరిటీ ఏజెన్సీనీ శిందే ప్రారంభించారు. ఈ ఏజెన్సీ ద్వారా బచ్చన్ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారు. అయితే, ఏజెన్సీకి వచ్చిన ఆదాయం అతడి భార్య ఖాతాలో కాకుండా శిందే ఖాతాలలో జమా అయ్యాయి. అనేక ప్రాపర్టీలను శిందే కొనుగోలు చేశారు. వాటిని బహిరంగంగా వెల్లడించలేదు."
-అధికారులు
శిందేను సస్పెండ్ చేసిన అనంతరం.. అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శిందే అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
అమితాబ్ బచ్చన్‌కు ప్రభుత్వం 'ఎక్స్' కేటగిరీ భద్రత కల్పిస్తోంది. ఇందులో భాగంగా నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు రెండు షిఫ్టుల్లో రక్షణ కల్పిస్తారు.
ఇదీ చదవండి: ఆ ఒక్క ఫొటోతో మోడల్‌గా మారిన కూలీ.. రూ. లక్షల్లో సంపాదన!