మహారాష్ట్రలో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టి దాదాపు కిలోమీటరు పైగా ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో వసయీలో జరిగింది. రెడ్ సిగ్నల్ పడినా సరే ఆగకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ కారు డ్రైవర్. దీంతో అక్కడే విధుల్లో ఉన్న సోమానాథ్ కత్రు చౌదరి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కారు డ్రైవర్ సేవ్ జాఫర్ సిద్ధిఖీ ఆపకుండా ముందుకు వెళ్లాడు. దీంతో కారును ఆపేందుకు ప్రయత్నించిన సోమనాథ్ కారు బానెట్‌పై చిక్కుకున్నాడు. కానిస్టేబుల్‌ను గమనించినా సరే డ్రైవర్ కారును ఆపకుండా ముందుకుసాగాడు.
దాదాపు కిలోమీటరుపైగా బానెట్‌పై కానిస్టేబుల్‌తో ప్రయాణించిన కారు.. ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఆగింది. కారు బానెట్‌పై చిక్కుకున్న కానిస్టేబుల్‌ను గుర్తించిన స్థానికులు వెంటనే అతడ్ని రక్షించారు. వెంటనే కారు డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
హైస్పీడ్‌తో వచ్చి బైకర్లను ఢీకొట్టిన కారు..
కర్ణాటకలో ఓ కారు డ్రైవర్ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. అతివేగంగా వచ్చి ఇద్దరు బైకర్లను ఢీకొట్టి ఆగకుండా ముందుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళకు, యువకుడికి తీవ్ర గాయలయ్యాయి. మరో ఇద్దరు యువకులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బెంగళూరులోని కేఆర్‌పురం టీసీ పాళ్య మెయిన్ రోడ్డుపై ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమ, చేతన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్‌పై స్టంట్స్ చేస్తూ విద్యార్థినిని ఢీకొట్టిన యువకుడు..
కేరళలో ఓ యువకుడు నడిరోడ్డుపై బైక్‌తో స్టంట్స్ చేస్తూ ఓ విద్యార్థినిని ఢీకొట్టాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఫిబ్రవరి 9న తిరువనంతపురంలోని కళ్లంబాళం ప్రాంతంలో జరిగింది. సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్‌తో విద్యార్థినిని ఢీకొట్టిన బైకర్ నౌఫల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
18 ఏళ్ల నౌఫల్కు రోడ్డుపై అమ్మాయిలు కనిపిస్తే బైక్‌పై స్టంట్స్ చేసేవాడని పోలీసులు చెప్పారు. నౌఫల్పై ఇదే తరహాలో మరో 7 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది రోజుల ముందే పోలీస్‌స్టేషన్‌లో రూ.19,250 జరిమానాను కట్టి తన బైక్‌ను విడిపించుకున్నాడని వెల్లడించారు.
లారీని ఢీకొట్టి యువకుడు మృతి..
కేరళలో లారీని వెనుక నుంచి ఢీకొట్టి ఓ బైకర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం త్రిసూర్ జిల్లాలోని పాలక్కాడ్ ప్రాంతంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుప రాడ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో శ్రద్దేష్ (21) అనే యువ బైకర్ ఒక్కరిగా లారీని ఢీకొట్టాడు. లారీలో ఉన్న ఇనుప రాడ్లు శ్రద్దేష్ మెడ, ఛాతీ భాగాల్లో గుచ్చుకున్నాయి. దీంతో శ్రద్దేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎగిరిన టార్పాలిన్‌ను తీయడానికి లారీని అకస్మాత్తుగా ఆపినట్లు డ్రైవర్ చెప్పాడు. లారీలో ఇనుప కడ్డీ లాంటి వస్తువులు తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన హెచ్చరిక గుర్తులు లేవని.. వాహనం ఆగినట్లు ఎలాంటి సూచనలు కనిపించ లేదని స్థానికులు తెలిపారు. అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.