Congress rally in Jaipur: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్థాన్ జైపుర్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించిన మైదానంలోకి నల్ల రంగు వస్త్రాలను అనుమతించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అశోక్ గహ్లోత్ సర్కారుపై ఎవరైనా నల్ల జెండాలు ఊపి నిరసన తెలుపుతారేమోనన్న భయంతో ఆ పార్టీ అలా చేసిందన్న విమర్శలకు తావిచ్చింది.
ఏం జరిగింది?
ధరల పెరుగుదలను నిరసిస్తూ జైపుర్ విద్యాధర్ నగర్ మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు, శానిటైజర్ల వంటివి మైదానం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. మరోవైపు.. కార్యకర్తలు, మద్దతుదారుల వద్ద ఉన్న నల్ల రంగు రుమాలు, స్కార్ఫ్, మఫ్లర్ వంటి వాటిని అనుమతించలేదు. వాటిని తీసివేస్తేనే లోపలికి వెళ్లనిచ్చారు.
నల్ల రంగు దుస్తులను సభకు అనుమతించకపోవటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు చేస్తారనే భయంతోనే అలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సభకు హాజరైనా.. మాట్లాడని సోనియా..
దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంక ఒకే వేదికపై కనిపించారు.
అయితే, ఈ సభలో సోనియా గాంధీ ప్రసంగించ లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు మాట్లాడిన తర్వాత సభ ముగిసినట్లు ప్రకటించారు. అంతా వేదికపై నుంచి వెళ్లిపోయారు. దిల్లీ నుంచి జైపుర్ వచ్చి సభకు హాజరైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడకపోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: 'అధికారం కోసమే హిందుత్వవాదుల ఆరాటం'