Ayodhya land scam: ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరానికి సమీపంలో జరిగిన బలవంతపు భూమి కొనుగోళ్ల వ్యవహారంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రభుత్వాధికారులతో కలిసి భాజపా నేతలు బలవంతంగా భూములను కొనుగోలు చేశారని వచ్చిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. 'మతం ముసుగులో హిందుత్వవాదులు దోచుకుంటున్నార'ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ayodhya land dispute case
"హిందువులు సత్యమార్గంలో నడుస్తారు. హిందుత్వవాదులు మతం ముసుగులో దోపిడీ చేస్తారు" అని హిందీలో ట్వీట్ చేశారు. ఓ వార్తా కథనాన్ని ట్వీట్‌కు జోడించారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్ బంధువులు సహా పలువురు ప్రభుత్వ అధికారులు అయోధ్యలో భూములు కొనుగోలు చేశారని ఆ వార్తల్లో ఉంది.
రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం ఈ అంశంపై సభలో లేవనత్తేందుకు ప్రయత్నించారు. అయితే, సభ నిరవధికంగా వాయిదా పడింది.
సుర్జేవాలా వరుస ప్రశ్నలు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ వ్యవహారాన్ని భూ కుంభకోణంగా అభివర్ణించారు. భాజపాకు సంబంధించిన వ్యక్తులు.. అయోధ్య నగరంలోని భూములను బహిరంగంగా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధించారు.
"భాజపా మేయర్ బావమరిది రూ.18 కోట్ల విలువైన భూమిని రామ మందిర ట్రస్టుకు ఐదు నిమిషాల్లో విక్రయించారు. రూ.25 లక్షల విలువైన భూమిని 79 రోజుల్లో రామ మందిర ట్రస్టుకు రూ.2.5 కోట్లకు అమ్మారు. ప్రైవేటు వ్యక్తులు విక్రయించలేని భూములను సైతం.. రామ మందిర ట్రస్టు డొనేషన్ల నుంచి కొన్నారు. భాజపా ఎమ్మెల్యేలు, మేయర్లు, కీలక పదవుల్లో ఉన్నవారి బలవంతపు భూకొనుగోళ్లపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? గౌరవనీయులైన మోదీజీ.. ఈ బహిరంగ లూటీపై మీరు ఎప్పుడు నోరు తెరుస్తారు? కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలు, రామ భక్తులు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. ఇది దేశ ద్రోహం కాదా? అయోధ్య పరిస్థితి 'అయోమయ పాలకులు- అస్తవ్యస్తమైన రాజ్యం'గా తయారైంది. ఈ విషయంపై ఎప్పుడు విచారణ జరుగుతుంది? అసలు విచారణ జరుగుతుందా లేదా? దీనిపై మోదీ వైఖరి ఏంటి?"
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
మరోవైపు, ఈ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని రెవెన్యూ శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేశంలో కొవిడ్ పరిస్థితులపై నేడు మోదీ సమీక్ష