Congress On AAP : ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ప్రకటనల కోసం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రభుత్వంతో ఖర్చు పెట్టిస్తోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. ఆప్‌ను 'అరవింద్ అడ్వర్టైజ్‌మెంట్ పార్టీ'గా అభివర్ణించింది. 'భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోందని.. అయితే, గుజరాత్‌లో మాత్రం యాడ్‌ల కోసం రెండు నెలల్లో రూ.36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రతినిధి అజోయ్ కుమార్ మాట్లాడారు. ప్రకటనల రాజకీయాలు, అవినీతికి పాల్పడుతోన్న ఆప్‌ను 'అరవింద్ అడ్వర్టైజ్‌మెంట్ పార్టీ', 'అరవింద్ యాక్టర్స్ పార్టీ', 'అరవింద్ ఐష్(విలాసం) పార్టీ'గా పిలవాలని అన్నారు.
'2015లో టీవీ, ప్రింట్ ప్రకటనల మీద ఆప్ రూ.81 కోట్లు ఖర్చు చేసింది. 2017-18లో రూ.117 కోట్లు, 2019లో రూ.200 కోట్లు, 2021-22 నాటికి ఏకంగా రూ.490 కోట్లు ఖర్చు చేసింది. షీలా దీక్షిత్ హయాంలో ప్రకటనల బడ్జెట్ రూ.11 కోట్లుగానే ఉంది' అని అజోయ్ కుమార్ తెలిపారు. 'పంజాబ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోంది. అయితే, టీవీ ఛానల్ యజమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గుజరాత్‌లో. ఎందుకంటే అక్కడ మాన్ ప్రభుత్వం యాడ్‌ల కోసం రెండు నెలల్లో రూ.36 కోట్లు ఖర్చు చేసింది' అని ఎద్దేవా చేశారు. దిల్లీలో విద్యారుణాల పథకంపై యాడ్‌ల కోసం రూ.19 కోట్లు ఖర్చు చేసిన ఆప్.. కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్ ఇచ్చిందన్నారు.
'దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వ విద్యావిధానం విజయవంతమైతే.. ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు ఎందుకు పెరుగుతున్నాయి? సీఎంగా షీలా దీక్షిత్ పాలనలో ఉత్తీర్ణత శాతం 90 శాతం ఉండగా.. ఇప్పుడు అది 81 శాతానికి తగ్గింది. పంజాబ్‌లోనూ ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారు. మరోవైపు.. దిల్లీ మద్యం పాలసీ ద్వారా ఆప్ అవినీతికి పాల్పడుతోంది. అవినీతి సొమ్ము.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఖర్చులకు, మంత్రుల జేబుల్లోకి, కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్తోంది' అని అజోయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని ఆప్ అనుసరిస్తోందా? అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: 'ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర- రూ.1,375 కోట్లతో ఆపరేషన్ లోటస్!'
బ్యాంక్ జాబ్‌లో చేరిన 5నెలల్లోనే స్కామ్.. భార్య ఖాతాలోకి కోట్లు.. పని కాగానే జంప్!