కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై నేరుగా విమర్శలు చేసి సంచలనానికి తెర తీసిన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్.. శాసనసభ ఎన్నికల వేళ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార కమిటీకి తానే సారథ్యం వహించేలా అధిష్ఠానాన్ని ఒప్పించారు. శుక్రవారం రాష్ట్ర నేతలతో కలిసి దిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఈమేరకు చర్చలు జరిపారు.
భేటీ అనంతరం ఐక్యతా రాగం ఆలపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రావత్. 'కలిసి ముందుకు సాగుతాం.. కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చుతాం. నా నేతృత్వంలోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతాయి.' అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీపై అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందా అని అడిగిన ప్రశ్నకు.. అంచెలంచెలుగా జరుగుతుందని సమాధానమిచ్చారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిపై నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. రావత్ పేరును ఇంకా ప్రకటించలేదు నాయకత్వం. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంపై అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉందన్నారు రావత్. ఎన్నికల అనంతరం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రక్రియకు కట్టుబడి ఉంటామన్నారు.
రావత్ తాజా వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది. దిల్లీకి వెళ్లే ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీతో ఆయనకు ఉన్న సమస్యలను పరిష్కరించే అంశంపై చర్చించినట్లు వెల్లడించాయి.