హిమాచల్ ప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు కొందరు గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అసత్యాల పుట్ట అని, వంట గ్యాస్, పెట్రో ధరల పెంపు వంటి కీలకాంశాలను విస్మరించారని అభ్యంతరం తెలిపారు. ఫలితంగా ప్రసంగంలోని ఆఖరి వాక్యం మాత్రమే చదివి అక్కడి నుంచి దత్తాత్రేయ బయటకు వెళ్లాల్సి వచ్చింది.
గవర్నర్ కారు వద్దకు వెళ్తుండగా కొందరు ఎమ్మెల్యేలు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది చాకచక్యంగా గవర్నర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
గవర్నర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్ భరద్వాజ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి సహా మొత్తం ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల్ని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.