Congress Guarantee in Rajasthan : రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్... ప్రజలకు మరో ఏడు గ్యారెంటీలు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు, ఆంగ్లమాధ్యమంలో పాఠశాల విద్య, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్, కిలో ఆవుపేడ రూ.2కు కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాల్లో జరిగే నష్టానికి రూ.15లక్షల బీమా పరిహారం వంటి గ్యారెంటీలు ఉన్నాయి.
Congress Guarantee Scheme Rajasthan : ఇదివరకే కోటీ 5లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, కుటుంబంలోని మహిళా పెద్దకు ఏడాదికి రూ.10వేలు వాయిదాల పద్ధతిలో ఇవ్వనున్నట్లు గహ్లోత్ ప్రకటించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. శునకాల కంటే ఎక్కువగా దేశంలో ఈడీ సంచారం చేస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ చెప్పారన్నారు. అంతకంటే దురదృష్టం ఇంకేం ఉంటుందని, ఎంత బాధతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవాలని అశోక్ గహ్లోత్ అన్నారు.
"దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కేంద్రం ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. సీబీఐ, ఈడీ, సీబీడీటీ అధిపతులను కలిసేందుకు సమయం కోరాను. ఆర్థిక అక్రమాలను అరికడితే గర్విస్తాం. నేరాలు చేసిన వారిని జైలుకు పంపితే సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ 9ఏళ్ల నుంచి దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయి. కేవలం విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్.. రాజకీయ అస్త్రాలుగా మార్చుకుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. కౌంట్‌డౌన్ ప్రారంభమైందనే విషయం ప్రధాని మోదీకి అర్థం కావడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు చేయటం వల్లనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌పై గురువారం ఈడీ దాడులు జరిగాయని గహ్లోత్ విమర్శించారు. ప్రధాని మోదీ తమ గ్యారెంటీ నమూనాను అనుసరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామన్న అశోక్ గహ్లోత్.. మరిన్ని వరాలు ప్రకటిస్తామన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరగనున్నాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Rajasthan Elections 2023 : రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా?