Congress CM face for Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తొలి నుంచి రేసులో ముందున్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీనే ఇందుకోసం ఎంపిక చేసింది. లూధియానా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. చన్నీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
"పేదలను అర్థం చేసుకునే వ్యక్తి పంజాబ్ ప్రజలకు ముఖ్యమంత్రిగా కావాలి. అణగారిన వర్గాల బాధలు ఆయనకు తెలిసి ఉండాలి. ఆకలి బాధలు ముఖ్యమంత్రి అర్థం చేసుకోగలగాలి. పంజాబ్‌కు అలాంటి వ్యక్తి అవసరం ఉంది. ఇది చాలా కష్టమైన నిర్ణయమే.. కానీ మీరు(ప్రజలు) దీన్ని సులభతరం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Punjab Congress CM Channi:
తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై చన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుత ఎన్నికలను మహా యుద్ధంగా అభివర్ణించారు. "ఇది చాలా పెద్ద యుద్ధం. నేను ఒంటరిగా పోరాడలేను. నా దగ్గర డబ్బు లేదు. పంజాబ్ ప్రజలే ఈ పోరాటంలో భాగమవుతారు' అని వ్యాఖ్యానించారు.
సిద్ధూ ఏమంటారంటే?
సీఎం అభ్యర్థి విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తారని చెప్పారు. రాహుల్ పాల్గొన్న సభావేదికపై ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తనకు అభ్యర్థిత్వం ఇస్తే మాఫియాను అంతం చేస్తానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని చెప్పారు. ఇతరులను ఎంపిక చేసినా.. తాను నొచ్చుకోనని.. చిరునవ్వుతో అందరినీ కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు.
అయితే, సీఎం అభ్యర్థిత్వంపై సిద్ధూ ఆశలు పెట్టుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ నిర్ణయం పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఏ మేరకు ప్రభావం చూపనుందోననేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల పార్టీ హైకమాండ్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించడం.. ఈ సందేహానికి కారణమవుతోంది. పార్టీ హైకమాండ్ బలహీనమైన ముఖ్యమంత్రి కావాలనుకుంటోందని, కానీ బలమైన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం పంజాబ్ ప్రజల చేతుల్లో ఉందని సిద్ధూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఏ అభ్యర్థి అయినా శక్తిని చాటుకోలేని గుర్రంలా ఉండాలనుకోరని తనదైన శైలిలో చమత్కరించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, ఇంకెవ్వరికీ అది సాధ్యం కాదని కూడా హెచ్చరించడం ద్వారా సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందన్న సంకేతాన్నిచ్చారు.
ఇదీ చదవండి: Punjab congress: సీఎం అభ్యర్థి తేలినా.. సిగపట్లు ఆగేనా?