Compostable Plastic Bowl With Hen Feathers : కోడి ఈకలతో తయారు చేసిన ఓ పదార్థంతో ప్లాస్టిక్ గిన్నెను రూపొందించింది ఉత్తర్‌ప్రదేశ్ ఐఐటీ కాన్పుర్‌కు చెందిన ఇంక్యుబేటెడ్ కంపెనీ నోవాఎర్త్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఓ గొప్ప ప్రత్యామ్నాయంగా దీనిని తయారు చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు సార్ధక్ గుప్తా తెలిపారు. అప్పుడే ఈ ప్రోడక్ట్‌కు పేటెంట్ హక్కులు కూడా రావడం విశేషం.
'ముందుగా కోడి ఈకలను జమ చేసి దాని నుంచి కెరాటిన్ అనే ఓ కంపోస్ట్‌ను తయారు చేస్తారు. అలా చేసిన పదార్థంతో గుండ్రటి ఈ బౌల్‌ను తయారు చేశాము. దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఐఐటీకి చెందిన నిపుణులతో మాట్లాడిన తర్వాతే దీనిని ఉత్పత్తి చేశాము. దీనికి పేటెంట్ హక్కులు కూడా లభించాయి. వీటి తయారీ కోసం ప్రత్యేకంగా ఓ ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నాము. వచ్చే ఏడాదే జూన్‌లో దీనిని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. తద్వారా ఇంకెన్నో కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్‌ను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది' అని సార్ధక్ గుప్తా అన్నారు.
"సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఏమిటి? అనే దానిపై చాలా రోజులుగా నా మదిలో ఆలోచన మెదులుతోంది. దీనికి సంబంధించి ఐఐటీ కాన్పుర్ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ క్రమంలో కోడి ఈకలలో కెరాటిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉన్నట్లు వారు గుర్తించారు. దీని ద్వారా పర్యావరణహితంగా ఉండే కంపోస్టబుల్ ప్లాస్టిక్ గిన్నెను తయారు చేయవచ్చనే ప్రతిపాదన వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా ఆధునిక యంత్రాల సాయంతో పనులు ప్రారంభించాము. మొదటి ప్రయత్నంలోనే ఓ చక్కటి ప్లాస్టిక్ గిన్నె(ఉత్పత్తి) తయారైంది. దీనికి పేటెంట్ హక్కులు కూడా పొందాము."
- సార్ధక్ గుప్తా, ఐఐటీ కాన్పుర్ ఇంక్యుబేటెడ్ కంపెనీ నోవాఎర్త్ వ్యవస్థాపకుడు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయని, అయితే ఇందుకు మెరుగైన ప్రత్యామ్నాయం లేదా పరిష్కారం మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని సార్ధక్ పేర్కొన్నారు. ఈ దిశగా తమ సంస్థ అడుగులు వేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కోడి ఈకలతో కంపోస్టబుల్ ప్లాస్టిక్ బౌల్‌ను తయారు చేసిందని ఆయన వివరించారు.
'ఎరువుగా కూడా వాడుకోవచ్చు'
తొక్క తీసిన యాపిల్, ఉల్లిపాయలు సహా ఇతర పండ్లు, కూరగాయల చెత్తను ఏ విధంగా అయితే కంపోస్ట్‌గా వినియోగిస్తామో, అదే విధంగా కోడి ఈకలతో తయారు చేసిన గిన్నెను కూడా వాడిన తర్వాత ఎరువుగా వినియోగించుకోవచ్చిన నోవాఎర్త్ వ్యవస్థాపకులు తెలిపారు. ఇది ఎకో-ఫ్రెండ్లీ అని ఆయన అన్నారు. చివరగా తాము తయారు చేసిన ఈ కంపోస్టబుల్ ప్లాస్టిక్ లాంటి వస్తువులను ఇతర కంపెనీలేవైనా తయారు చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం తమ సాంకేతికతను వినియోగించుకోవచ్చని సార్ధక్ గుప్తా చెప్పుకొచ్చారు.
అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?
'వరదల్లో మా ఇల్లు మునిగిపోయింది- నా టాలెంట్‌ను తల్లిదండ్రులకు చూపించలేకపోయా'- కబడ్డీ ప్లేయర్ ఆవేదన