మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి, ఓ స్వచ్ఛంద సంస్థపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్యా సింగ్ అనే ఓ న్యాయవాది ఈమేరకు దిల్లీ సైబర్ విభాగం డీసీపీకి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి, పబ్లిక్ పాలసీ మేనేజర్ షాగుఫ్తా కమ్రాన్, సహా 'రిపబ్లిక్ ఎథీస్ట్' వ్యవస్థాపకుడు ఆర్నిన్ నవాబీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
రిపబ్లిక్ ఎథీస్ట్కు చెందిన ట్విట్టర్ ఖాతాలో కాళీ మాత ఫొటోలను తప్పుగా షేర్ చేశారని ఆదిత్యా సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా... శుత్రత్వాన్ని, అశాంతిని, సమాజంలో విద్వేషాన్ని రగిల్చేవిగా ఉన్నాయని తెలిపారు. దీన్ని తొలగించటంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున ట్విట్టర్‌తో పాటు సదరు ఖాతాదారుపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని కోరారు.
ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నిబంధనలను అమలు చేయనందుకుగాను భారత్‌లో ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది.
ఇదీ చూడండి: Twitter: ఆ అధికారి నియామకంపై ట్విట్టర్ స్పష్టత
ఇదీ చూడండి: ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?