ఓ జిల్లా కలెక్టర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఒక స్టడీహాల్‌ను ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కుర్చీలు, టేబుళ్లు, మంచినీరు, ఏసీని సైతం సమకూర్చారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను స్టడీహాల్‌లో అందుబాటులో ఉంచారు.
విష్ణు.. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా కలెక్టర్. ఒక రోజు కారులో వెళ్తుండగా స్థానిక పార్కులో కొంత మంది విద్యార్థులను చూశారు. అనంతరం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే వారంతా పార్కులోకి కాలక్షేపానికో, మానసిక ఉల్లాసానికో రాలేదు. చదువుకోవడానికి వచ్చారు. ప్రైవేటు స్టడీ సెంటర్లకు వెళ్లే స్తోమత లేక, ఇంట్లో ప్రశాంతంగా చదివేందుకు వీలులేక ఇలా పార్కుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని విష్ణు తెలుసుకున్నారు. వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. వెంటనే పాలాయంకొట్టాం బస్‌స్టాప్ పక్కన రెండు షాపులను గుర్తించి కొద్ది రోజుల్లోనే వాటిని స్టడీహాల్గా మార్చారు.
"ఒక రోజు మేమంతా పార్కులో చదువుకుంటున్నప్పుడు కలెక్టర్ సార్ మమ్మల్ని చూశారు. వచ్చి మాతో మాట్లాడారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఇలా మాకోసం స్టడీహాల్ ఏర్పాటు చేశారు. మేము అసలు ఊహించలేదు. ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్‌కు సంబంధించిన అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి."
--సౌందర్య
"ఈ స్టడీ సెంటర్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా రకాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. పార్కులో చదువుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ప్రశాంతంగా చదువుకుంటున్నాం. రోజుకు కేవలం రూ.12 చెల్లించాలి. నెలవారీ ప్యాకేజీ సైతం ఉంటుంది."
--ముత్తు సుధ.
స్టడీహాల్కు ఒక ఇంఛార్జ్ సైతం ఉన్నారని ఉద్యోగార్థులు చెప్పారు. ప్రైవేటు స్టడీహాల్లోనూ లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.