UP CMO Twitter handle hacked: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ట్విట్టర్ (యూపీసీఎంఓ) ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ట్విట్టర్ ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత కార్టూన్లు, ఎన్ఎఫ్టీల చిత్రాలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. వాటితో పాటు 'ఎన్ఎఫ్టీలను యానిమేషన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి?' అనే ట్యుటోరియల్ను ట్వీట్ చేశారు.
ముప్పై నిమిషాల పాటు ట్విట్టర్ ఖాతా హ్యాకర్ల అధీనంలో ఉంది. వెంటనే గ్రహించిన అధికారులు.. చర్యలు తీసుకున్నారు. ట్విట్టర్ అధికారులను సంప్రదించారు. హ్యాకర్లు దాదాపు 400-500 ట్వీట్లు చేశారని అధికారులు తెలిపారు. అసహజంగా వచ్చిన ట్వీట్లను గుర్తించిన ట్విట్టర్ యంత్రాంగం.. ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సీఎంఓ ఖాతాలో ట్వీట్లు కనిపించడం లేదు. త్వరలోనే ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
12.40 గంటలకు హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హ్యాకర్లు తమను తాము బోర్డ్ఏప్వైసీ, యుగాల్యాబ్స్ సహ వ్యవస్థాపకులుగా అభివర్ణించుకున్నారు. ఈ రెండు సంస్థలు క్రిప్టోకరెన్సీలకు చెందినవే. ప్రభుత్వాధినేతలు, కీలక వ్యక్తుల ఖాతాలు ఇటీవల తరచూ హ్యాక్‌కు గురవుతున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఖాతాను హ్యాక్ చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి.
ఇదీ చదవండి: 'ఏ క్షణంలోనైనా చంపేస్తాం'.. మాజీ సీఎంలకు బెదిరింపు లేఖ