Yogi Adityanath Assembly constituency: త్వరలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి పోటీ చేస్తున్నారు. సొంత ఇలాఖా గోరఖ్పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. భాజపా విడుదల చేసిన యూపీ అభ్యర్థుల తొలి జాబితాలో యోగి పేరు ఉండగా.. ఆయన పోటీ ఖరారైంది. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరాతు స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.
దళిత వర్గానికి చెందిన ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, భాజపా ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య ఆగ్రా(రూరల్) నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ మరోసారి నోయిడా బరిలో నిలిచారు.
UP Assembly Polls:
యూపీ ఎన్నికల కోసం 107 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది భాజపా. మొదటి విడత ఎన్నికల జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకు 38 మందిని ఫైనల్ చేసింది.
ఇందులో 44 మంది ఓబీసీకి చెందిన నేతలు కాగా.. 19 మంది ఎస్సీకి చెందినవారు ఉన్నారు.
20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..
107 స్థానాల్లో 83 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి 63మందికే మరోసారి అవకాశం ఇచ్చింది భాజపా అధిష్ఠానం. మిగతా 20మందికి టికెట్ కేటాయించలేదు. అయితే వీరంతా ఇతర పార్టీల్లో చేరడమో, లేక ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 312 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
అఖిలేశ్ సెటైర్..
యోగి ఆదిత్యనాథ్ తొలుత అయోధ్య, ప్రయాగ్రాజ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం గోరఖ్పుర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. యోగిపై సెటైర్ వేశారు.
''భాజపాకు కృతజ్ఞతలు. ప్రజలు ఎలాగూ ఇంటికి పంపిస్తారని తెలిసిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయనను ఇంటికి పంపించింది. యోగి ఆదిత్యనాథ్ అయోధ్య, ప్రయాగ్రాజ్ నుంచి పోటీ చేస్తారని ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేమో ఇలా జరిగింది.''
- అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత
ఇదీ చదవండి: 'భాజపా పాలనలోనే ముస్లింలకు అత్యంత ఆనందం, భద్రత'