CM KCR Meeting on Rains : గత మూడు రోజులుగా అల్పపీడనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి కూడా తెలుసుకున్నారు. రేపు, ఆదివారం కూడా భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరోవైపు పౌరసరఫరాల శాఖపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్లుగా అధునాతన రైస్ మిల్లుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లుల ఏర్పాటు చేయాలన్నారు. పాత మిల్లులు ఉంటూనే ఇవి అదనంగా వస్తాయని తెలిపారు. అందుకు తగ్గ విధివిధాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
CM KCR Review On Civil Supplies Department : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు.. మరికొద్దీ రోజుల్లో పూర్తికానున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో మరో కోటి టన్నుల ధాన్యం పెరిగి నాలుగు కోట్లకు చేరుకుంటుందన్నారు. ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతున్న పరిస్థితుల్లో మిల్లింగ్ కెపాసిటీని పెంచాలని సూచించారు. కొనసాగుతున్న మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
కొత్తగా అధునాతన మిల్లులు : రాష్ట్రంలో నిల్వ ఉన్న 1 కోటి 10 లక్షల టన్నుల వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నారు. దీంతో రైతులకు మరింత లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేసి.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు సమాచారం : రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్ధంగా పని చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వర్షాల ప్రభావం, వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని డీజీపీ సూచించారు. ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు పోలీస్ శాఖ నుంచి సహాయ కోసం ఎదురుచూస్తారని అన్నారు.
ఇవీ చదవండి :