CM KCR Inaugurated Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతికి అంకితం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ఛాన్ చేసిన ఆయన.. మొదటి దశ ఎత్తిపోతలను ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి పలువురు మంత్రులు, అధికారులతో కలిసి రోడ్డుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి స్వాగతం పలికారు.
Palamuru Rangareddy Lift Irrigation Opening Today : అక్కడి నుంచి నార్లాపూర్ పంప్‌హౌజ్ కంట్రోల్ రూం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత పాలమూరు-రంగారెడ్డి పథకం పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన ప్రత్యేక పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకుని.. శ్రీశైలం వెనక జలాల నుంచి ఎత్తిపోస్తున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గంగమ్మకు సారె, పూలను సమర్పించారు. ఆ తర్వాత మొదటి దశ పంపింగ్‌ను ముఖ్యమంత్రి స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు.
CM KCR Meeting at Kollapur : మొదటి దశ పంపింగ్ ఆన్ చేయటంతో శ్రీశైలం వెనక జలాల నుంచి అప్రోచ్ కెనాల్, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా అప్పటికే సర్జ్‌పూల్‌కు చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరుకున్నాయి. గ్రామ దేవతలకు అభిషేకించేందుకు కృష్ణా జలాలతో నింపిన కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అందజేశారు. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్దకు అధికారులు మినహా ఇతరులెవ్వరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వస్తున్నందున 3 వేల మంది సిబ్బందితో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం నేరుగా కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి కొల్లాపూర్ సమీపంలోని సింగోటం కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు హాజరయ్యే విధంగా.. ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మంది చొప్పున బహిరంగ సభకు తరలించారు.
CM KCR Kollapur Meeting : మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ప్రపంచంలోనే అతి పెద్దదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వలసల జిల్లా అయిన పాలమూరుకు.. 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆదిలాబాద్‌లో నూతనంగా నిర్మించిన డీసీఎంఎస్ గోదాం సముదాయాన్ని ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్‌రావు, రాఠోడ్ బాపూరావులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం డీసీఎంఎస్ ఛైర్మన్ తిప్పని లింగయ్యను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించారు.