CM JAGAN KEY COMMENTS ON VISAKHA: అభివృద్ధికి మూలస్తంభంగా మూలపేట నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద గ్రీన్‌పీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నౌపడలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని.. అక్కడే కాపురం పెట్టబోతున్నానని జగన్ వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే అక్కడికి వస్తున్నట్లు జగన్ చెప్పారు.
"రాష్ట్రంలో అతి పెద్ద నగరం మాత్రమే కాకుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరంగా విశాఖపట్నం ఉంది. అందుకే సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా. సెప్టెంబర్ నుంచి వైజాగ్‌లోనే కాపురం పెట్టబోతున్నా.వికేంద్రీకరణలో భాగంగానే విశాఖకు వస్తున్నా"-జగన్, ముఖ్యమంత్రి
24 నెలల్లో మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జగన్ తెలిపారు. పోర్టు సామర్థ్యం 100 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని.. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమల వల్ల యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. మూలపేట పోర్టుతో పాటు జిల్లాకు మరో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తాయని.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
"అభివృద్ధికి మూలస్తంభంగా మూలపేట నిలుస్తుంది. పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. 24 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయితే 35 వేలమందికి ఉపాధి లభిస్తోంది. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమల వల్ల మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయి. మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తాయి. ఈ నాలుగేళ్ల కాలంలో 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం"-జగన్, ముఖ్యమంత్రి
ఆగస్టులో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ రోగులకు సేవలందించేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని వెల్లడించారు. రూ.700 కోట్లతో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆరు లైన్ల రోడ్లను నిర్మించబోతున్నాం అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: