CJI NV RAMANA FAREWELL: సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయవ్యవస్థ స్పూర్తిమంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి, వారికి న్యాయాన్ని అందించాలని అదే పరమావధిగా పనిచేయాలని కోరారు. దేశమంటే మట్టికాదని, దేశమంటే మనుషులన‌్న మహాకవి మాటలను గుర్తుచేసిన ఆయనప్రజలు అభివృద్ధి చెందితే, దేశమూ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
ప్రతీ పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సీజేఐగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రమణ సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్ధాంతమని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డానని వివరించారు. సీజేఐగా తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తెచ్చామన్న ఆయన, మౌలిక వసతుల కల్పనకు.. తన వంతు కృషి చేసినట్లు వివరించారు. ప్రతి తీర్పులోనూ ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానని తెలిపారు. చివరిశ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
"భారత న్యాయవ్యవస్థ సాధారణ ప్రజలకు ఎంతో దూరంలో నిలిచింది. ఇప్పటికీ కోట్ల మంది అణగారిన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం అవసరం ఉంది. అవసరమైనప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి ఇంకా వారు జంకుతూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ మీడియాలో తగిన ప్రచారాన్ని పొందలేదని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది.
కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం నా రాజ్యాంగ విధి అని భావించాను. న్యాయవ్యవస్థపై అవగాహన కల్పించేందుకు, విశ్వాసం కల్పించేందుకు అనేక సదస్సులు నిర్వహించాం. నేను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, ప్రజలను కలిసినప్పుడు వారు న్యాయ పరిభాషలో మాట్లాడడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. న్యాయాన్ని అందించే వ్యవస్థకు.. కక్షిదారుడు, న్యాయాన్ని అర్థించే వాడే అత్యంత ముఖ్యమైన అంశం. కానీ మన న్యాయవ్యవస్థ, ప్రొసీడింగ్స్ ఇంకా ఆంగ్లేయులనాటి విధానాలనే అవలంబిస్తోంది. అది మన ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదు. మన న్యాయవ్యవస్థను భారతీకరించడం అత్యవసరం. నా ఉద్దేశం ఏమంటే మన సమాజంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయపాలన జరగాలి. వేగంగా న్యాయం అందించే దిశలో ఆధునిక మౌలికవసతుల కల్పనను ముందుకు తీసుకెళ్లాం.
--జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అంతకుముందు జస్టిస్ ఎన్వీ రమణ పనితీరుపై తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు లలిత్, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులన్నీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయని కొనియాడారు. దేశంలోని హైకోర్టులు, ట్రైబ్యునళ్లలో.. మూడోవంతు నియామకాలు జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం చేపట్టినవేనని ప్రశంసించారు. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జస్టిస్ రమణ ఎంతో కృషి చేశారని వివరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించారని న్యాయమూర్తులు, న్యాయవాదులు కొనియాడారు. కరోనా సంక్షోభంలో కూడా ఆయన సాంకేతికతను వినియోగించుకుని పనిచేసిన తీరు అనితర సాధ్యమని చెప్పారు. ఎన్నో సున్నితమైన రాజ్యాంగ అంశాలను వివాదాలు లేకుండా పరిష్కరించిన ఘనత జస్టిస్ రమణ సొంతమని వివరించారు. జస్టిస్ రమణ పదవీకాలం దేశ న్యాయవ్యవస్థకు సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.
దేశ విదేశాల్లో దేశ న్యాయవ్యవస్థకు సమున్నత గౌరవం లభించిందని ప్రజల కోణంలో భారత న్యాయవ్యవస్థ పనిచేస్తుందనే విషయం ప్రస్ఫుటమైందని బార్ అసోసియేషన్ కొనియాడింది. రాజ్యాంగ స్ఫూర్తి, పౌరహక్కుల రక్షణలో కొత్త అధ్యాయం సృష్టించారని ప్రశంసించింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై కీలకమైన చర్చ జరిగే విధంగా చేయడంలో జస్టిస్ రమణ విజయం సాధించారని తెలిపింది. బార్ అసోసియేషన్లకు జస్టిస్ రమణ ఇచ్చిన గౌరవం ఎప్పటికీ మరచిపోలేమన్న న్యాయవాదులు.. న్యాయవాదులు, జడ్జిలపట్ల జస్టిస్ రమణ తీసుకున్న శ్రద్ధ.. గతంలో చూడలేదన్నారు. జడ్జిల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో జస్టిస్ రమణ ఎంతో కృషిచేశారని చెప్పారు. సామాన్యుడికి అర్థమయ్యే విధంగా జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులు.. అందరికీ ఆదర్శనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొనియాడారు.
న్యాయాధికారిగా మూడు విషయాలు చెప్పదలుకున్నా. దేశ న్యాయవ్యవస్థకు జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సేవలు అపారం. మొదటిది వేర్వేరు హైకోర్టులు, ట్రైబ్యునల్స్‌లో వేగంగా నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం న్యాయమూర్తుల్లో మూడో వంతు న్యాయమూర్తులను ప్రస్తుత కొలీజియమే నియమించింది. రెండోది ఎప్పుడూ మరిచిపోలేం. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయన పడిన తపనను మనం ఎప్పటికీ మరవలేం. ఇప్పటివరకు తీర్పుల విషయానికొస్తే ప్రతి తీర్పులో నేను ఒకటి గమనించాను. న్యాయాధికారి లేదా న్యాయవాదిగా కాదు పౌరునిగా చెబుతున్నాను. ఆయన(జస్టిస్ ఎన్.వి. రమణ) ఇచ్చిన తీర్పులు సాధారణ పౌరులు అర్థం చేసుకునేలా ఉన్నాయి.
--తుషార్ మెహతా, భారత సొలిసిటర్ జనరల్
జస్టిస్ ఎన్వీ రమణకు మాతృభాషపై మమకారం అద్భుతమని చెప్పిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. పదవీ విరమణ తర్వాత తెలుగులోనే పుస్తకాలు రాస్తానని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రమణ మేథస్సు, సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని చూస్తే రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే అత్యున్నత పదవిని అదిష్టించేవారని వికాస్‌సింగ్ వ్యాఖ్యానించారు.
ఆయన( జస్టిస్ ఎన్వీ రమణ)కు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉండేది. ఆయనకు ఉన్న తెలివితేటలు, సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని చూస్తే..రాజకీయాలు కొంత నష్టపోయాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే ఇవాళ భారత ప్రధానమంత్రి పదవిలో ఉండేవారు. ఆయన న్యాయ వృత్తిలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వృత్తిలో అత్యున్నత పదవిని ఆయన అలంకరించారు.
--వికాస్ సింగ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
జస్టిస్ రమణ ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగించి.. తన తర్వాత వచ్చేవారికి అందించడం తన బాధ్యత అని కాబోయే సీజేఐ జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. అయితే జస్టిస్ రమణ ప్రజాదరణను అందుకోవడం తనకు సాధ్యం కాదని జస్టిస్ లలిత్ స్పష్టంచేశారు.
నా ముందు ఉన్న ప్రధాన న్యాయమూర్తి(జస్టిస్ ఎన్వీ రమణ) ప్రజాదరణ చూస్తే..నాకు చాలా కష్టమైన సమయమనే చెప్పాలి. ఇక్కడి నుంచి ఆ స్థాయిని ఎలా కొనసాగిస్తాననే అంశం చూడాలి. నేను ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఆ స్థాయి ప్రజాదరణను అందుకోవడం నాకు సాధ్యం కాదని నేను స్పష్టంగా చెప్పగలను. జస్టిస్ రమణ సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే.
--జస్టిస్ యు.యు.లలిత్, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్‌లో జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో నెలకొల్పిన మధ్యవర్తిత్వ కేంద్రం.. ఆయనకు దేశం పట్ల ఉన్న బాధ్యత, ముందుచూపునకు ప్రత్యక్ష నిదర్శనమని బార్ అసోసియేషన్ కొనియాడింది. సీజేఐగా తనదైన ముద్ర వేసిన జస్టిస్ ఎన్వీ రమణకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నామని పేర్కొంది.
ఇవీ చదవండి: మన ప్లాన్ ఇది కాదు కదా, ఆజాద్ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్