ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమే సరైన న్యాయం అని నమ్మే జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.. సకాలంలో ఇచ్చే న్యాయమైన తీర్పులు, సాంకేతికత సాయంతో అందే శీఘ్ర న్యాయపాలనే.. సమర్థ న్యాయ నిర్వహణకు గీటురాళ్లని విశ్వసిస్తారు. గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించకపోయినా పర్లేదుకానీ రాజ్యాంగ ధర్మం తప్పకూడదనే ఆయన.. రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయాలంటారు.
న్యాయం అంటే...
న్యాయం అనేది ఒక పదంలా కనిపించినా.. భారత రాజ్యాంగంలో దానికి విస్తృతార్థం ఉందని జస్టిస్ ఎన్.వి. రమణ చెబుతుంటారు. న్యాయం అంటే.. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమేనని ఆయన అభిప్రాయం. మంచి పనితీరు కనబరచడం, కేసుల పరిష్కారానికి గడువులు నిర్ణయించడం, సకాలంలో న్యాయమైన తీర్పులు వెలువరించడం, సాంకేతికత సాయంతో శీఘ్ర న్యాయపాలన సాధించడం సమర్థ న్యాయ నిర్వహణకు గీటురాళ్లుగా.. జస్టిస్ ఎన్.వి. రమణ చెబుతారు. వీటిని పాటించగల న్యాయమూర్తులను.. సుశిక్షితులైన కేసు మేనేజర్లను కోర్టు నిర్వాహకులుగా నియమించాలని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాలలో, కేంద్రంలో కింది నుంచి పైస్థాయి వరకు ఈ ప్రమాణాలను పాటించినప్పుడు న్యాయ ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని ఆయన భావన.
దిగువ న్యాయస్థానాలకు.. ఎలక్ట్రానిక్ డేటా బేస్‌లను కల్పించి, కోర్టు గదులను నిర్మించి తగిన సంఖ్యలో సహాయక సిబ్బందిని నియమిస్తే కేసులను వేగంగా.. పరిష్కరించవచ్చని జస్టిస్ రమణ చెబుతుంటారు. కోర్టులు, కేసుల నిర్వహణ సమర్థంగా ఉంటే న్యాయప్రక్రియ ఎంతగానో.. మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం. కేసుల విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించాలంటే విచారణ ప్రక్రియలోని వివిధ అంచెలను నిర్దిష్ట కాలావధుల లోపల పూర్తిచేయాలని ఆదేశించే అధికారం.. న్యాయమూర్తులకు ఉండాలంటారు.
అవసరమే ఆవిష్కరణలకు ఆలంబన అని నమ్మే జస్టిస్ రమణ.. కొవిడ్ సమయంలో ఈ- లోక్ అదాలత్‌ను తీసుకువచ్చారు. ఈ- వివాద పరిష్కార విధానం.. ద్వారా కక్షిదారులకు ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుండగా.. న్యాయవ్యవస్థలపై పెరిగిపోతున్న పని భారాన్ని ఈ-లోక్ అదాలత్‌లు తగ్గిస్తాయని జస్టిస్ రమణ నమ్మకం.
సూచనలు...
న్యాయవ్యవస్థపై రాజకీయ నాయకులు, మీడియా నుంచి ఎక్కువ విమర్శలు వస్తాయనే జస్టిస్ ఎన్.వి. రమణ.. ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియలో అలాంటి విమర్శలను ఎదుర్కొనేందుకు వెనుకాడకూడదని న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారికి చెబుతారు. కొంతమంది వ్యక్తులు, వ్యవస్థలపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తుంటారని.. అలాంటి యత్నాలను తిప్పికొట్టాలంటారు. తమను తాము.. సమర్థించుకునే స్వేచ్ఛ లేకపోవటం వల్ల న్యాయమూర్తులు ఇతరులను సున్నితమైన లక్ష్యాలుగా మారుతున్నారని ఆయన భావన. సంచలన తీర్పులు, ప్రచార ఆర్భాటాల కోసం న్యాయమూర్తులు వృత్తిధర్మాన్ని బలి చేయకూడదని.. జస్టిస్ రమణ సూచిస్తుంటారు. జడ్జిలను గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించకపోయినా ఫర్వాలేదు కానీ.. రాజ్యాంగ ధర్మం తప్పుదోవ పట్టకూడదనేదే ఆయన సిద్ధాంతం. రాజ్యాంగం మీద.. ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జడ్జిగా తన సొంతభావాలను కేసులపై రుద్దకూడదని, రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగ ఆకాంక్షలు, నిబంధనలకు లోబడి మాత్రమే.. తీర్పులు ఇవ్వాలని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేవారికి జస్టిస్ రమణ సూచిస్తుంటారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు సమాజాన్ని అభివృద్ది చేసేలా ఉండాలంటారు. ఇదే సమయంలో.. న్యాయ విభాగంలో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ.. విధులతో పాటు ఆరోగ్యంపైనా దృష్టిసారించాలంటారు. ఖాళీ సమయాల్లో అంతర్జాలంలో గడపడానికి బదులుగా.. సాహిత్యం, ఆటలపై దృష్టిసారించాలని సలహా ఇస్తారు.
రూల్ ఆఫ్ లా...
న్యాయవ్యవస్థ బలోపేతమైతే.. ప్రజాస్వామ్యం బలోపేతమైనట్లేనని విశ్వసించే జస్టిస్ ఎన్.వి. రమణ.. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ రూల్ ఆఫ్ లా పాటించాలంటారు. విభజనలు, దోపిడీలతో గడిచిన గతం.. సమసమాజ స్థాపన కోసం అంకితమైన భవిష్యత్తు మధ్య వంతెనను నిర్మించే ప్రయత్నం.. రాజ్యాంగం చేస్తుందని అంటారు. రాజ్యాంగం హక్కులతోపాటు బాధ్యతలను నిర్దేశించిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలంటారు.
రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుచేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మిగిలిపోతుందని.. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా.. దాన్ని అమలుచేసేవారు సజ్జనులు అయితే అది మంచిగా నిలిచిపోతుందన్న అంబేడ్కర్ సిద్ధాంతాలను జస్టిస్ ఎన్.వి. రమణ విశ్వసిస్తారు.
మొత్తంగా..నూతన సాధనాలను అందిపుచ్చుకుని సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలను అనుసరిస్తూ.. రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే.. సరికొత్త న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయాలనేదే జస్టిస్ రమణ ఆలోచన.