You Can Travel 56 days on Single Train Ticket : దేెశంలో రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉండడంతో.. మెజారిటీ జనాలు ట్రైన్ జర్నీని ఎంచుకుంటారు. అయితే.. ప్రయాణికులకోసం ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన 'సర్కూలర్ జర్నీ టికెట్' గురించి మీకు తెలుసా? ఈ టికెట్ ఒక్కటి తీసుకుంటే.. ఏకంగా 56 రోజులపాటు రైలులో ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Circular Journey Ticket Details : ఇది ఒక స్పెషల్ టికెట్. మీరు ఏ క్లాసులోనైనా ఈ టికెట్ తీసుకోవచ్చు. ఈ సర్క్యులర్ ప్రయాణ టికెట్‌లో గరిష్ఠంగా 8 జర్నీలు ఉంటాయి. అంటే.. ఒక చోట మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. 56 రోజులపాటు దేశంలో ఎక్కడైనా తిరిగి.. మళ్లీ మీరు ప్రయాణం మొదలు పెట్టిన చోటుకు చేరుకోవచ్చు. అయితే.. మధ్యలో మీరు దిగే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదు. ఒక స్టేషన్లో దిగి.. ఆ ప్రాంతంలో కొన్ని రోజులు గడిపి.. ఆ తర్వాత మరో ప్రాంతానికి ప్రయాణం కొనసాగించవచ్చు.
ఉదాహరణకు ఇలా చూద్దాం..
మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లి రావడానికి టికెట్ కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభమైన మీ ప్రయాణం.. చాలా స్టేషన్లు దాటుకుంటూ తిరుపతి చేరుకుంటుంది. మీరు తిరుపతిలో దిగి.. కొన్ని రోజులు అక్కడి సమీపంలోని ప్రాంతాలను చూసి.. మళ్లీ బెంగళూరుకు ట్రైన్ ఎక్కొచ్చు. బెంగళూరు వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత.. చెన్నై వొళ్లొచ్చు.. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత.. తిరుగు ప్రయాణం మొదలు పెట్టొచ్చు. తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో.. మీరు ఎక్కడైనా దిగాలనుకుంటే.. అక్కడ దిగొచ్చు. అక్కడి నుంచి తిరిగి ప్రయాణం కొనసాగించవచ్చు. ఇలా.. రాకపోకల సమయంలో మొత్తం 8 చోట్ల దిగి, ఎక్కే ఛాన్స్ ఉంది. 56 రోజుల లోపల మీ జర్నీ ముగించాల్సి ఉంటుంది. ఏయే స్టేషన్లలో ట్రైన్ దిగుతారనేది మీరు సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ టికెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే (How to Book Circular Journey Ticket in Telugu) :
- సర్క్యులర్ జర్నీ టికెట్ల కోసం రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్‌ని సంప్రదించాలి.
- వారు మీ ట్రైన్ జర్నీ ప్లాన్ ఆధారంగా టికెట్ ధరను లెక్కించి.. స్టేషన్ మేనేజర్‌కు తెలియజేస్తారు.
- మీరు ప్రయాణం ప్రారంభించే స్టేషన్ బుకింగ్ ఆఫీసులో సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేయాలి. మీ బ్రేక్ స్టేషన్లను కూడా అక్కడే ఎంచుకోవచ్చు.
- అంతే.. మీ టికెట్‌ను జారీ చేస్తారు.
ఈ టికెట్ ధరను ఎలా లెక్కిస్తారంటే..?
- టికెట్ చెల్లుబాటు వ్యవధి, ప్రయాణం చేసే రోజులు, విరామ ప్రయాణానికి సంబంధించిన రోజులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని టికెట్ ధరను లెక్కిస్తారు.
- 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా లెక్కిస్తారు. అలాగే ప్రయాణం చేయని రోజును 200 కిలో మీటర్లుగా లెక్కిస్తారు.
- సీనియర్ సిటిజన్లకు కనిష్ఠంగా 1000 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే టికెట్ ధరపై సబ్సిడీ కూడా ఇస్తారు.
- పురుషులకైతే 40 శాతం, మహిళలకైతే 50 శాతం రాయితీ లభిస్తుంది.
- ఈ సర్క్యులర్ జర్నీ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం కచ్చితంగా ఉండాలి.
- ఈ టికెట్ ధర.. సాధారణ టికెట్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
- టూరిస్టులకు ఈ టికెట్ బాగా ఉపయోగపడుతుంది.
గుడ్ న్యూస్ - మీరు ట్రైన్ మిస్సైతే - టికెట్ డబ్బు వాపసు పొందొచ్చు!