atrocity case against minister: విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదుకు చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి పెద్దిరెడ్డి... ఎస్సీలను అవమానించేలా మాట్లాడారని మాజీ జడ్జి రామకృష్ణ... చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయగా.. కేసు నమోదుకు ఆదేశించింది. కేసుకు సంబంధించిన విచారణ నివేదిక అందించాలని బి.కొత్తకోట పోలీసులను కోర్టు ఆదేశించింది.
పెద్దిరెడ్డిపై పోరాటం కొనసాగిస్తా.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అలుపెరుగని పోరాటం చేస్తానని, అతనిపై నేరాలను రుజువు చేసే వరకు తాను విశ్రమించనని మాజీ న్యాయమూర్తి రామకృష్ణ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... 2020 సంవత్సరంలో తనపై దాడి జరిగిందని, తనపై జరిగిన దాడికి సంబంధించి అప్పట్లో పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అన్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ నేర విభాగం ప్రత్యేక కోర్టులో తాను ప్రైవేట్ కేసు వేశానని వెల్లడించారు. తనపై పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచారని, ఈ సంఘటనలో తన కుడిచేయి భుజం విరిగిందని ఇందుకు సంబంధించిన ఆధారాలు బీ కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇచ్చానని తెలిపారు. అయితే, ఆ ఆధారాన్ని మంత్రిపెద్ది రామచంద్రారెడ్డి దొంగలించారని చెప్పారు. 2020లో తిరుపతిలో విలేకరులతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ దళిత అధికారులను, దళిత బిడ్డలను చాలా అమర్యాదగా మాట్లాడారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన మదనపల్లిలో విలేకరులకు చూపించారు. తన కేసుకు సంబంధించి 2023 ఆగస్టు 18లోగా కేసు నమోదు చేయాలని న్యాయస్థానం బి కొత్తకోట పోలీసులకి సూచించిందని రామకృష్ణ తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరాలను రుజువు చేయకుంటే తాను అరగుండు చేయించుకుని సంఘంలో తిరుగుతానని సవాల్ విసిరారు.