మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన ఓ ట్వీట్ వివాదస్పదంగా మారింది. ఆ ట్వీట్ మహిళలను అవమానించేలా ఉందని విమర్శనాస్త్రాలు సంధించింది గాయని చిన్మయి శ్రీపాద. మహిళలపై జరుగుతున్న దాడులను ఆత్మగౌరవంతో కాపాడుకోవాలా? అని కమల్ చేసిన ట్వీట్‌పై ధ్వజమెత్తింది.
ఏం జరిగింది..
ఫుడ్ బ్యాంక్ ఇండియా వ్యవస్థాపకురాలు, ఎంఎన్ఎం మహిళా విభాగం సభ్యురాలు స్నేహా మోహన్‌దాస్ తన ఇంట్లో మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. "దానికి మిమ్మల్ని మీరు రక్షించుకునే సామర్థ్యంపై విశ్వాసం ఉంటే నిర్భయంగా, మరింత స్వేచ్ఛగా జీవించవచ్చు." అంటూ ట్యాగ్‌లైన్ జోడించారు.
కమల్ ట్వీట్లో ఏముంది?
మోహన్‌దాస్ ట్వీట్‌పై స్పందించిన కమల్.. "మహిళల రక్షణ, సాధికారతకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. దాంతో పాటు ఆత్మరక్షణ సామర్థ్యం ఆత్మవిశ్వాసం ఉంటే.. హింసాత్మక ఘటనలు అహింసగా మారుతాయి. హింస, అహింసల సమ్మేళనం ఎలాంటి దుర్ఘటనలు జరగడానికి తావివ్వదు. మీ ఆత్మవిశ్వాసం.. పెప్పర్ స్ప్రే కంటే మెరుగ్గా పని చేస్తుంది." అని కమల్ ట్వీట్ చేశారు.
'దాడి జరుగుతుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలా?'
కమల్ ట్వీట్‌పై స్పందిస్తూ.. ''మహిళలు ఆత్మరక్షణ సాధన చేయడం, నేర్చుకోవడాన్ని ఆయన అవమానిస్తున్నారు. అందుకు బదులు మహిళలు ఆత్మవిశ్వాసంతో తమను తాము కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. కిరాతకులు దాడులకు పాల్పడుతుంటే మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మహిళలకు ఇలాంటి సలహాలనే కమల్ ఇస్తున్నార'ని ఆరోపించింది చిన్మయి.
2014లోనూ కమల్.. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మనసు పరిశుభ్రంగా ఉంటే మీ వద్దుకు ఎవరూ రారు' అని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పట్లో దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.
ఇదీ చూడండి: మూడేళ్ల పాప లాకప్ డెత్‌పై నిరసన జ్వాల